• facebook
  • whatsapp
  • telegram

పీజీ వైద్య విద్యకు 50-60% రుసుము: హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: పీజీ మెడికల్‌ రుసుములకు సంబంధించి మే 20న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మే 26న‌ హైకోర్టు సవరించింది. జీవో 20 ప్రకారం మొత్తం ఫీజులో ఎ కేటగిరీలో 50 శాతం, బి కేటగిరీకి 60 శాతం వసూలు చేయాలంటూ తాజాగా ఉత్తర్వులిచ్చింది. ఈ ఫీజులు పిటిషనర్లతో పాటు మొత్తం విద్యార్థులకు వర్తింపజేయాలంది. పీజీ మెడికల్‌ కోర్సుల ఫీజుల పెంపుపై ఏప్రిల్‌ 14న ప్రభుత్వం జారీ చేసిన జీవో 20ని సవాలు చేస్తూ డాక్టర్‌ ఎస్పీ సుదీప్‌శర్మ మరో 120 మంది పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు పాత జీవో ప్రకారం మొత్తం ఫీజు, కొత్త జీవో 20 ప్రకారం చెల్లించాల్సిన మొత్తంలో ఎ కేటగిరీకి 50 శాతం, బి కేటగిరీకి 60 శాతం చెల్లించాలంటూ ఈనెల 20న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులు విద్యార్థులకు భారంగా ఉన్నాయని, మొత్తం ఎ కేటగిరీ అభ్యర్థులు 75 శాతం, బి కేటగిరీలో 85 శాతం ఫీజు చెల్లించాల్సి వస్తోందని, వీటిని సవరించాలంటూ మరోసారి పిటిషన్‌ వేశారు. దీనిపై మే 26న‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది సామా సందీప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ కరోనా కష్టకాలంలో గత ఉత్తర్వులు విద్యార్థులకు భారంగా పరిణమించాయని.. తాజా ఉత్తర్వులను పిటిషనర్లకే కాకుండా మొత్తం విద్యార్థులకు వర్తింపజేసేలా చూడాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది..