• facebook
  • whatsapp
  • telegram

2021 నుంచి పీజీ వైద్య విద్యలో ఉమ్మడి కౌన్సెలింగ్‌ను పరిశీలించండి

* ఎన్‌బీఈకి సూచించిన సుప్రీంకోర్టు
దిల్లీ: వైద్య విద్యలో పీజీ కోర్సులకు, డీఎన్‌బీ (డిప్లమేట్‌ ఆఫ్‌ నేషనల్‌ బోర్డు) సీట్లకు 2021 నుంచి ఉమ్మడి కౌన్సెలింగ్‌ చేపట్టే అవకాశాన్ని పరిశీలించాలని జాతీయ పరీక్షల మండలి (ఎన్‌బీఈ)కి సుప్రీంకోర్టు సూచించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే వర్తించేలా ఆదేశాలు ఇవ్వడానికి మాత్రం నిరాకరించింది. ఇప్పటికే చాలామంది అభ్యర్థులకు సీట్ల కేటాయింపు పూర్తయినందువల్ల అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిల ధర్మాసనం మే 26న‌ స్పష్టం చేసింది. నీట్‌ పీజీలో ర్యాంకులు తెచ్చుకున్నా కౌన్సెలింగ్‌లో తాము కోరుకున్న కోర్సుల్లో సీట్లు రాలేదంటూ ఆలపాటి జ్యోత్స్న, మరో ముగ్గురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెగ్యులర్‌ సీట్లు భర్తీ అయ్యాక డీఎన్‌బీ కోర్సులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నందువల్ల మొదటగా డిగ్రీ/డిప్లొమా సీట్లు పొందినవారు డీఎన్‌బీ కోర్సులకు అనర్హులుగా మిగిలిపోతున్నారని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఉమ్మడి కౌన్సెలింగ్‌ ద్వారా ఇలాంటి ఇబ్బందులు పరిష్కారమవుతాయని ధర్మాసనం అభిప్రాయపడింది.