• facebook
  • whatsapp
  • telegram

డిగ్రీ, ఇంజినీరింగ్‌లో ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి

* ఆంగ్ల మాధ్యమంపై వెనక్కి తగ్గం
ఈనాడు, అమరావతి: డిగ్రీ, ఇంజినీరింగ్‌లో ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేయనున్నామని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. మూడేళ్ల డిగ్రీ, నాలుగేళ్ల బీటెక్‌లో వేసవి సెలవులు, చివరి సెమిస్టర్‌లో ఇంటర్న్‌షిప్‌ ఉంటుందని వెల్లడించారు. విద్యా ప్రమాణాల నాణ్యత, నియంత్రణకు హైకోర్టు విశ్రాంత జడ్జిలతో కమిషన్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి పేద ఇంట్లో చదువుల దీపాలు వెలగాలని, వారి భవిష్యత్తు మారాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ‘మన పాలన- మీ సూచన’లో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయంలో మే 27న‌ విద్యాశాఖపై విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులతో జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ వెబ్‌సైట్‌ను సీఎం ప్రారంభించారు. ‘‘సెప్టెంబరు నుంచి బోధన రుసుములను తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. వారే కళాశాలకు వెళ్లి పిల్లల చదువు, మౌలిక వసతులను పరిశీలించి, రుసుములు చెల్లిస్తారు. చెప్పిన సదుపాయాలను కల్పించకపోతే తల్లిదండ్రులు ఫిర్యాదు చేయొచ్చు. దీనిపై చర్యలు తీసుకుంటాం. వసతి దీవెన కింద ఏడాదికి రెండు పర్యాయాలు రూ.10వేలు చొప్పున తల్లుల చేతిలోనే పెడతాం’’ అని సీఎం వెల్లడించారు. ‘‘తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా ఆంగ్ల మాధ్యమంలో చదివించాలనుకున్నట్లు 96 శాతం మంది తల్లులు అభిప్రాయం చెప్పారు. దీన్ని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలికి పంపాం. మండలానికో తెలుగు మాధ్యమం పాఠశాల పెడుతూ ఆంగ్ల మాధ్యమం పెట్టాలని సిఫార్సు చేసింది. దీన్ని తీసుకొని సుప్రీం కోర్టులో ఫైల్‌ చేశాం. 94 శాతం తల్లిదండ్రుల కమిటీలు ఏకగ్రీవ తీర్మానాలు ఇచ్చాయి.
మొదట 1-6 తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్పు చేసి, విడతల వారీగా పదోతరగతి వరకు తీసుకువెళ్తాం.’’ అని తెలిపారు. ‘‘విద్య కోసం చేసే ఖర్చు రాష్ట్రంలోని పిల్లలపై పెడుతున్న పెట్టుబడి. మనదేశంలో 74 శాతం మంది ఇంటర్మీడియట్‌ తర్వాత చదువు ఆపేస్తున్నారు. అదే పిల్లలను వైద్యులు, ఇంజినీర్లు, కలెక్టర్లుగా చదివిస్తే ఆ కుటుంబాల తలరాత మారిపోతుంది. పేదరికం సమస్యకు పరిష్కారం చదువు’’ అని పేర్కొన్నారు.
ముఖ్యాంశాలు
* 47,650 విద్యా సంస్థల్లో ‘నాడు-నేడు’ కింద 9రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం. 15,715 విద్యాసంస్థల్లో జులైకి పనులు పూర్తవుతాయి.
* అమ్మఒడి పథకంలో వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు 75 శాతం హాజరు ఉండాలి.
* ఆగస్టు 3న పాఠశాలలు తెరిచిన వెంటనే జగనన్న విద్యా కానుకను అందిస్తాం. ఇందుకు రూ.660 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
* మధ్యాహ్న భోజనం మెనూపై ఇంతగా దృష్టిసారించిన సీఎం ఇంకొకరు ఉండరు. 15-20రోజుల పాటు అధికారులు, పౌష్టికాహార నిపుణులతో కలిసి చర్చించి, మెనూ తీసుకొచ్చాం. అదనంగా రూ.465 కోట్లు వ్యయమవుతోంది.
వర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయాలి
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ సీట్లలో నిష్పత్తి లోపించిందని, ఒక ఇంజినీరింగ్‌ సీటుకు మూడు పాలిటెక్నిక్‌ సీట్లు ఉండాలని ఐఐటీ, తిరుపతి సంచాలకులు సత్యనారాయణ తెలిపారు. సీఎంతో జరిగిన ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 40 శాతం పోస్టులు  భర్తీ చేయాలని కోరారు.

  • Tags