• facebook
  • whatsapp
  • telegram

పది పరీక్షలు జులైలో నిర్వహించడం తగదు

* సందేహాల నివృత్తికి తావేది?
* ఎస్‌ఏ-1 మార్కుల ఆధారంగా పైతరగతికి అనుమతివ్వండి
ఈనాడు, అమరావతి: పదో తరగతి పరీక్ష విధానంలో మార్పు తెచ్చి ఉపాధ్యాయులతో విద్యార్థులు సందేహాల్ని నివృత్తి చేసుకునేందుకు కనీస సమయం ఇవ్వకుండా జులైలో పరీక్షలు నిర్వహించడం తగదని పేర్కొంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ‘సొసైటీ ఫర్‌ బెటర్‌ లివింగ్‌’ సంస్థ అధ్యక్షుడు టి.భవానీప్రసాద్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రతిపాదిత పరీక్ష నిర్వహణ ప్రక్రియను వాయిదా వేసి.. ఎస్‌ఏ-1 పరీక్ష మార్కులు/గ్రేడింగ్‌ ఆధారంగా విద్యార్థులు పైతరగతికి వెళ్లేందుకు అనుమతించాలని అభ్యర్థించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం మే 27న‌ ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌కు నోటీసులు జారీచేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
అంతకుముందు పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారన్నారు. పరీక్ష విధానం మార్చి నిర్వహించడం వల్ల విద్యార్థులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. సందేహాలు నివృత్తి చేసుకునేందుకు విద్యార్థులకు కొంత సమయం ఇవ్వాలన్నారు. లేదా.. మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ పదో తరగతి బోర్డులు పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు కామన్‌ గ్రేడింగ్‌ ఇచ్చి పైతరగతికి అవకాశం ఇచ్చిన తరహాలో ఇక్కడి విద్యార్థులకు వెసులుబాటు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిల్‌ దాఖలు చేసే అర్హత పిటిషనర్‌కు లేదన్నారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
పీజీ వైద్య సీట్ల భర్తీలో రిజర్వుడు విద్యార్థులకు అన్యాయం
పీజీ వైద్య సీట్ల భర్తీలో రిజర్వేషన్‌ కేటగిరి విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని బీసీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ వెంకటేశ్వర్లు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ ఓపెన్‌ కేటగిరిలో సీట్లు పొందిన ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ (రిజర్వుడు)విద్యార్థులు.. వివిధ కారణాలతో ఆ సీటును వదులుకొని మరో కళాశాలలో చేరినప్పుడు (స్లైడింగ్‌), ఖాళీ అయిన సీటును రిజర్వుడు విద్యార్థులకు కేటాయించాలన్నారు. అందుకు భిన్నంగా ఎన్టీఆర్‌ వైద్య విజ్ఞాన వర్సిటీ అధికారులు ఓపెన్‌ కేటగిరి వారికి కేటాయిస్తున్నారన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. గతంలో హైకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫారసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని, వర్సిటీ అధికారుల్ని ఆదేశించింది. విచారణను మే 29కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది.

  • Tags