• facebook
  • whatsapp
  • telegram

స్పెషాలిటీ మారినా ఆ సీటు రిజర్వేషనే

* పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌లో మార్పులు
* జీవో 43, 89ను సవరించిన ప్రభుత్వం

ఈనాడు - విజయవాడ:  పీజీ మెడికల్‌, డెంటల్‌ కౌన్సిలింగ్‌లో రెండేళ్లుగా వివాదాస్పదమైన జీవో 43, 89లను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మార్చింది. ఓపెన్‌ కేటగిరీలో సీటు పొందిన అభ్యర్థి ఆ తర్వాత రిజర్వేషన్‌లో కళాశాలతోపాటు స్పెషాలిటీ మార్చుకున్నా అతని వల్ల ఖాళీ అయిన ఓపెన్‌ సీటు.. అతను ఏ రిజర్వేషన్‌కు చెందితే దాని కిందనే పరిగణించేలా కొత్తగా జీవో 57, 58లను తీసుకొచ్చింది. మే 29 విడుదలైన కొత్త జీవోలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ సహా రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరనుంది.
ఇదీ పాత విధానం...
అభ్యర్థి వదులుకున్న ఓపెన్‌ సీటును అతనికి సంబంధించిన రిజర్వేషన్‌ అభ్యర్థితోనే భర్తీ చేయాలనేది పాత జీవోలు 43, 89 కూడా సూచిస్తున్నాయి. కానీ ఓపెన్‌ కేటగిరీలో తీసుకున్న స్పెషాలిటీని మార్చుకుంటే మాత్రం ఇది వర్తించదు. స్పెషాలిటీ మార్చుకుంటే ఆ సీటును ఓసీ అభ్యర్థులకు కేటాయిస్తున్నారు.
మార్పు చేయడానికి కారణం..
కళాశాల, స్పెషాలిటీ మారినా ఖాళీ అయిన ఓపెన్‌ సీటును రిజర్వేషన్‌ కిందకే తీసుకురావాలని రెండేళ్లుగా వివాదం నడుస్తోంది. పరిష్కరించేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది. ఆ కమిటీ సూచనలు, 2018లో సుప్రీం కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని జీవోలను సవరించింది.
నోటిఫికేషన్‌ విడుదల
రాష్ట్రంలోని మెడికల్‌, దంత వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ సీట్ల ప్రవేశాలకు మే 29న‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌   జారీ చేసింది. ఈ ఏడాదిగా కొత్తగా వెబ్‌ ఆధారంగా ఆప్షన్ల ప్రక్రియను చేపడుతోంది. మే 29న‌ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మే 31 మధ్యాహ్నం 12.30 గంటల వరకు పీజీ మెడికల్‌ కోర్సులకు, 31 ఉదయం 9 గంటల్లోగా ఎండీఎస్‌ కోర్సులకు అభ్యర్థులు కళాశాలలు, కోర్సుల   ఆప్షన్లకు కసరత్తు చేసుకోవాలి. అదే రోజు నీట్‌ మెరిట్‌ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు.
రిజర్వు కేటగిరిలకు లబ్ధి
కొత్త ఉత్తర్వులతో పీజీ వైద్య సీట్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూరనుందని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య తెలిపారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వు కేటగిరిలకు అన్యాయం జరుగుతోందని వివరించగా సీఎం కొత్త ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొన్నారు. పీజీ వైద్య సీట్ల ఫీజుల తగ్గింపుతో పేదలకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 23 ఇంజినీరింగ్‌ కళాశాలలు గతంలో ఎక్కువ రుసుములను పొందాయని, వీటిని విచారించే అధికారం కమిషన్‌కు ఉందన్నారు.
ఫీజు తగ్గింపుపై ఉత్తర్వు
పీజీ వైద్య, దంత వైద్య విద్య ఫీజుల తగ్గింపుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020-21 నుంచి 2022-23 విద్యా సంవత్సరం వరకు ఈ ఫీజులు అమల్లో ఉంటాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. యాజమాన్యాలు ఏడాదిలో రెండు సార్లు ఫీజులు తీసుకోవాలని, నిర్దేశించిన మొత్తం కాకుండా ఇతర పద్ధతుల్లో వసూళ్లు చేస్తే చట్టపరంగా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్యార్థులకు ఉపకార వేతనాలనూ చెల్లించాలని పేర్కొన్నారు.
ప్రవేశాలను నిలిపివేస్తున్నాం
పీజీ వైద్య, దంత వైద్య విద్యలో 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను నిలిపివేస్తున్నామని రాష్ట్ర ప్రైవేట్‌ వైద్య కళాశాలల యాజమాన్యాల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలో పీజీ కోర్సులకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే మెడికోలకు ఇవ్వాల్సిన ఉపకార వేతనాలే ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. అసలే ఆదాయం లేని పరిస్థితుల్లో ఫీజులు తగ్గించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించింది. ఈ పరిస్థితుల్లో ప్రవేశాలు నిలిపివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు శుక్రవారం పేర్కొంది.
                                                                                                                                                                       - కళాశాలల యాజమాన్యాల సంఘం
యథావిధిగా కౌన్సెలింగ్‌: వీసీ
ప్రవేశాల కౌన్సెలింగ్‌ యథావిధిగా కొనసాగుతుందని వీసీ శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. ప్రైవేటు వైద్య కళాశాలల సంఘంతో ఉన్నతాధికారులు, తాము చర్చిస్తున్నామన్నారు.