• facebook
  • whatsapp
  • telegram

‘పది’ విద్యార్థులకు యథావిధిగా తరగతులు!

* మిగిలిన వారికి ‘షిఫ్టు’ విధానంపై యోచన
ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి విద్యార్థులకు గతంలో మాదిరిగానే కొత్త విద్యా సంవత్సరం (2020-21)లో కూడా వారానికి ఆరు రోజులు పాఠశాలలు నడపాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. లేకుంటే పాఠ్యాంశాలపై వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం కష్టమని విద్యాశాఖ అభిప్రాయపడుతోంది. పాఠశాలల పునఃప్రారంభంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో సమావేశం జరగడానికి ముందు అధికారుల భేటీలో దీనిపై చర్చ జరిగినట్లు సమాచారం. మిగిలిన తరగతుల వారికి షిఫ్టు విధానం అమలు చేసినా సమస్య ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ముఖ్యంగా అధికసంఖ్యలో విద్యార్థులు ఉండే ప్రైవేటు పాఠశాలల్లో అది వర్తింపజేయవచ్చన్న చర్చ జరిగినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు భావించినట్లు తెలిసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం జులైలో విద్యా సంస్థలపై నిర్ణయం తీసుకుంటామని తెలపడంతో అక్కడి నుంచి మార్గదర్శకాలు వచ్చిన తర్వాత పాఠశాలల పునఃప్రారంభంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల్లో పరీక్షలు ఎలా?
జూన్‌ 8వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నద్ధమైనా కరోనా కేసుల కారణంగా కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల్లోని విద్యార్థులు ఎలా పరీక్షా కేంద్రాలకు వస్తారన్న సమస్యపై అధికారుల్లో చర్చ సాగుతోంది. ఆ ప్రాంతంలోని విద్యార్థులు పలు కేంద్రాల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. మరి వారిని ఎలా పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎక్కువ మంది ఉంటే అక్కడే పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలన్న యోచన ఉన్నా ప్రశ్నపత్రాలను తీసుకురావడం సమస్య కానుంది. రోజూ కరోనా కేసులు పెరుగుతుండటం, జూన్‌ 4వ తేదీన పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో కేసు విచారణ ఉండటంతో విద్యాశాఖతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ న్యాయస్థానం ఏం చెబుతుందన్న ఉత్కంఠ నెలకొంది.

  • Tags