• facebook
  • whatsapp
  • telegram

గురుకుల విద్యార్థులకు ట్యాబ్‌లు కొనిద్దాం

* ప్రభుత్వానికి గురుకుల సొసైటీల ప్రతిపాదన
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గురుకుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాల బోధన కోసం ట్యాబ్‌లు కొనుగోలు చేయాలని గురుకుల సొసైటీలు భావిస్తున్నాయి. రాష్ట్రంలోని గురుకులాల్లో దాదాపు 5 లక్షల మంది బడుగు, బలహీన, వెనుకబడిన తరగతుల విద్యార్థులు చదువుకుంటున్నారు. లాక్‌డౌన్‌లో పాఠశాలలు మూతపడటంతో సిలబస్‌ పూర్తి చేయడానికి గిరిజన సొసైటీలో ఆన్‌లైన్‌ పాఠాల వ్యవస్థను ప్రవేశపెట్టింది. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులకు స్మార్ట్‌ఫోన్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో టీశాట్‌ (టీవీ)ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలు బోధిస్తోంది. కరోనా నేపథ్యంలో పరిస్థితుల మేరకు ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పాల్సి వస్తే విద్యార్థులు నష్టపోయే ప్రమాదముందని సొసైటీలు భావిస్తున్నాయి. మూడునెలల కాలానికి పాఠశాలలు మూసివేయడంతో ఒక్కో విద్యార్థిపై మెస్‌ఛార్జీల కింద రూ.2850 నుంచి రూ.3450 చొప్పున మిగిలాయి. అలాగే కాస్మొటిక్‌ ఛార్జీల కింద మరో రూ.150 నుంచి రూ.225 వరకు కలిసొచ్చాయి. కొన్ని సొసైటీల్లో రూ.450 వరకు మిగిలాయి. ఇలా మిగిలిన ఖర్చులను ట్యాబ్‌లు కొనుగోలు చేసేందుకు వెచ్చించేలా అనుమతివ్వాలని ఎస్సీ, మైనార్టీ గురుకులాల సొసైటీలు సంబంధితశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశాయి. ప్రతిపాదనలు పంపిస్తే సీఎం దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు సొసైటీలు ట్యాబ్‌ల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి.

  • Tags