• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన

ఈనాడు, హైద‌రాబాద్‌:‌ కరోనా మహమ్మారి నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ వినూత్న నిర్ణయం తీసుకుంది. వివిధ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా కీలకమైన ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆన్‌లైన్‌లో నిర్వహించనుంది. లాక్‌డౌన్‌ సమయంలో అభ్యర్థులు ప్రయాణాలు చేసి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్‌ తెలిపింది. జీహెచ్‌ఎంసీ, ఐపీఎంలో ఆహార భద్రత అధికారుల పోస్టుల భర్తీ ప్రక్రియలో ఆన్‌లైన్‌ పరిశీలన అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ పోస్టులకు గతంలోనే రాతపరీక్షలు నిర్వహించగా.. కనీస అర్హత మార్కులు పొందిన అభ్యర్థులకు సంబంధించి మెరిట్‌ జాబితాను విడుదల చేసింది. పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్లు, వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు తెలిపింది. సదరు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్‌ చేసేందుకు వీలుగా ప్రత్యేక లింకు ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది.