• facebook
  • whatsapp
  • telegram

ఆందోళనలో పీజీ వైద్య విద్యార్థులు

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించిన మొదటి విడత పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులను ప్రైవేటు కళాశాలలు చేర్చుకోవడం లేదు. కౌన్సెలింగ్‌లో 1134 కన్వీనర్‌ సీట్లకుగాను విశ్వవిద్యాలయం 1,091 భర్తీ చేసి విద్యార్థులకు కేటాయింపు పత్రాలు ఇచ్చింది. ఇందులో 14 ప్రైవేటు కళాశాలల్లో 618 మంది సీట్లు పొందారు. వీరంతా జూన్ నాలుగో తేదీలోపు కళాశాలల్లో చేరాలి. విద్యార్థులు వెళ్తే యాజమాన్యాలు చేర్చుకోవడం లేదు. గడువు దగ్గరపడుతుండటంతో చర్యలు తీసుకోవాలని విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు. ‘సీట్ల కేటాయింపు పత్రాలు జారీ తర్వాత తమ పరిధిలో ఉండదు, కళాశాలలు, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి’ అని రిజిస్ట్రార్‌ డా.శంకర్ జూన్ 2వ తేదీన‌ తెలిపారు. గడువును విశ్వవిద్యాలయం మరో వారం పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
57 జీవోపై హైకోర్టు విచారణ
ఈనాడు, అమరావతి: పీజీ వైద్య సీట్ల భర్తీకి జారీ చేసిన జీవో 57పై దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారించింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. విచారణను జూన్‌ 18కి వాయిదా వేసింది. సీట్ల భర్తీ ప్రక్రియ తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందంటూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం జూన్ 2న‌ ఈమేరకు ఆదేశించింది. మెరిటోరియస్‌ రిజర్వేషన్‌ అభ్యర్థులు స్లైడింగ్‌ అయితే ఆ సీట్లను వారి కేటగిరీ విద్యార్థులతోనే భర్తీ చేయాలని ప్రభుత్వం జీవో 57ను జారీచేసింది.

  • Tags