• facebook
  • whatsapp
  • telegram

పీజీ విద్యార్థులూ బోధకులే

* ప్రతి ఆరుగురు ఎంటెక్‌, పీహెచ్‌డీ, పీడీఎఫ్‌ విద్యార్థులు ఒక బోధకుడితో సమానం
* ఎన్‌ఐటీల్లో పోస్టుల మంజూరుకు కొత్త కొలమానం
ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (ఎన్‌ఐటీ)ల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ, పీడీఎఫ్‌ విద్యార్థులను బోధనా సిబ్బందితో సమానంగా కేంద్రం పరిగణించనుంది. ప్రతి ఆరుగురు పీజీ, ఆపై స్థాయి విద్యార్థులను ఒక బోధనా సిబ్బందితో సమానంగా గుర్తించనుంది. దీని ఆధారంగా భవిష్యత్తులో కొత్త పోస్టులు మంజూరు చేయనుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న 31 ఎన్‌ఐటీల్లో విద్యార్థుల సంఖ్య, ఇతర వివరాలు పంపించాలని కేంద్ర మానవ వనరులశాఖ ఆయా సంస్థల సంచాలకులను ఆదేశించింది. ఈ నిర్ణయంతో భవిష్యత్తులో ఎన్‌ఐటీల్లో బోధనా సిబ్బంది పోస్టులు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎన్‌ఐటీల్లో మొత్తం బోధన సిబ్బంది పోస్టులు 7,483 కాగా.. వీటిలో 2,820 (37.6%) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబరులో 2,200 పోస్టులు భర్తీ చేయాలని కేంద్రం ఆదేశించింది.
టీచింగ్‌ అసిస్టెంట్‌షిప్‌..
ఎన్‌ఐటీల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ, పీడీఎఫ్‌ (పోస్టు డాక్టొరల్‌ ఫెలోషిప్‌) చదివే విద్యార్థులు బోధన, పరిశోధన, ప్రయోగశాలల్లో సహకారం అందిస్తారు. దీంతో ప్రతి నెలా కేంద్ర ప్రభుత్వ విభాగాలు లేదా ఆయా ఎన్‌ఐటీలు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నాయి. దీన్ని టీచింగ్‌ అసిస్టెంట్‌షిప్‌గా పిలుస్తారు. ఈ నేపథ్యంలో వారు కూడా బోధనా సిబ్బందే అని కేంద్రం భావిస్తున్నట్లు ఎన్‌ఐటీ వర్గాలు చెబుతున్నాయి.

కేంద్రీయ వర్సిటీల్లో పోస్టుల భర్తీలో జాప్యం
పలు కేంద్రీయ వర్సిటీల్లో పోస్టుల భర్తీలో జాప్యం చోటుచేసుకోనుంది. దేశవ్యాప్తంగా 42 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉండగా, దాదాపు 10 వర్సిటీలకు ఉపకులపతుల(వీసీ) నియామకానికి కేంద్రం నోటిఫికేషన్లు జారీచేసింది. హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ, ఉర్దూ వర్సిటీలకు కూడా ప్రకటనలు జారీచేసింది. అనంతపురంలోని ఏపీ వర్సిటీకి ఉపకులపతి నియామకంపై ఇంటర్వ్యూ పూర్తయినా నియామక ఉత్తర్వులు జారీకాలేదు. జేఎన్‌యూ, మరికొన్ని వర్సిటీల వీసీల పదవీకాలం వచ్చే కొద్ది నెలల్లో ముగియనుంది. ఈ పరిస్థితుల్లో ఆయా వర్సిటీల్లో నియామకాల ప్రక్రియలో జాప్యం జరగనుంది. కేంద్రీయ వర్సిటీల్లో మొత్తం బోధనా సిబ్బంది పోస్టులు 18,243 కాగా.. 6,688 (36.6%) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.