• facebook
  • whatsapp
  • telegram

నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకుల్లో.. హెచ్‌సీయూకు ప్రథమస్థానం

ఈనాడు, హైదరాబాద్‌: నేచర్‌ ఇండెక్స్‌ 2019-20 ర్యాంకుల్లో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం సత్తా చాటింది. విశ్వవిద్యాలయాల పరంగా చూస్తే పరిశోధనల్లో దేశంలోనే మొదటి ర్యాంకు సాధించింది. మొత్తంగా దేశంలోని అన్ని విద్యాసంస్థలతో పోల్చుకుంటే 15వ స్థానం దక్కించుకుంది. గతేడాది 17వ ర్యాంకు సాధించగా.. ఈసారి రెండు స్థానాలు మెరుగుపరుచుకుంది. గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 మధ్యకాలానికి పరిశోధనాఫలాల ఆధారంగా నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకులు జారీ చేసింది. లైఫ్‌ సైన్సెస్‌, కెమిస్ట్రీ, ఫిజికల్‌ సైన్సెస్‌లో జరిగిన పరిశోధనల ప్రాతిపదికగా ర్యాంకు దక్కింది. లైఫ్‌సైన్సెస్‌ విభాగంలో 6వ ర్యాంకు, కెమిస్ట్రీలో 12 ర్యాంకు, ఫిజికల్‌ సైన్సెస్‌లో 13వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా హెచ్‌సీయూ వీసీ ప్రొ.పొదిలె అప్పారావు మాట్లాడుతూ.. ఆచార్యులు, విద్యార్థుల కృషికి ప్రతిఫలంగా ర్యాంకు దక్కినట్లు తెలిపారు. నేచర్‌ ఇండెక్స్‌లో మొదటిర్యాంకు సాధించడం గర్వంగా ఉందన్నారు.