• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌ విద్య ఎలా?

* ప్రామాణిక నిర్వహణ విధానంపై హెచ్‌ఆర్‌డీ కసరత్తు
ఈనాడు, దిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో తప్పనిసరి అయిపోయిన ఆన్‌లైన్‌ విద్యా విధానంపై ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌వోపీ) రూపొందించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్‌ఆర్‌డీ) కసరత్తు చేస్తోంది. ఆన్‌లైన్‌ విధానంలో చాలా పాఠశాలలు తరగతులు నిర్వహిస్తున్నాయని, ఫలితంగా చిన్నారులు 7 నుంచి 8 గంటలపాటు ఎలక్ట్రానిక్‌ పరికరాల ముందు కూర్చోవాల్సి వస్తోందని రోజురోజుకు ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే డిజిటల్‌ విధానంలో బోధన చేసే పాఠశాలలకు హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ఈ మార్గదర్శకాల్లోనే ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌వోపీ) ఉండనుంది. కొన్ని ఇళ్లలో కేవలం ఒక కంప్యూటర్‌ లేదా ట్యాబ్‌ ఉంటోందని, పిల్లలందరికీ దానిని ఇచ్చే పరిస్థితి లేదన్న ఫిర్యాదులపైనా అధికారులు దృష్టి పెట్టారు. అదే సమయంలో కొందరు విద్యార్థులు ఆన్‌లైన్‌ బోధన సమయంలో చాటింగ్‌ ద్వారా ఉపాధ్యాయులను (ప్రత్యేకంగా మహిళా ఉపాధ్యాయులను) వేధిస్తున్న సంగతీ మంత్రిత్వశాఖ దృష్టికి వచ్చినట్లు వివరించారు. ‘‘కరోనాకు టీకా, ఔషధం వచ్చే వరకు చాలా పాఠశాలలు ఆన్‌లైన్‌ విద్యను, తరగతి బోధనతో కలిపి చేపట్టడంపై దృష్టిపెట్టాయి. రానున్న రోజుల్లో ఈ విధానం సర్వసాధారణం కానుంది. కాబట్టి, ఆన్‌లైన్‌ విద్యకు సంబంధించి రూపొందిస్తున్న ఎస్‌వోపీ ఇందుకు బాగా ఉపయోగపడుతుంది’’ అని ఓ అధికారి చెప్పారు. అదే సమయంలో పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్గదర్శకాలను రూపొందిస్తోంది.
35కోట్లు - దేశంలో విద్యార్థులు
15% - గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్నవారు
42%- పట్టణాలు, నగరాల్లో ఇంటర్నెట్‌ సదుపాయం ఉన్న విద్యార్థులు
డిజిటల్‌ విభజనే: నిపుణులు
దిల్లీ, బెంగళూరు: ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యేందుకు స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో లేక కేరళలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడితే, ఇంటర్నెట్‌ సిగ్నల్‌ సరిగ్గా అందక మారుమూల ప్రాంతాల్లో అనేకచోట్ల విద్యార్థులు తమ ఇళ్ల పైకప్పులపైకెక్కి నిరీక్షించాల్సి వస్తోంది. తల్లిదండ్రుల వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌ తనకే కావాలంటూ ఇళ్లలో తోబుట్టువుల కొట్లాటలు సరేసరి... ఈ పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ తరగతులు కొన్ని సమస్యలకూ దారి తీస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిజిటల్‌ సాధనాలు అందుబాటులో ఉన్న విద్యార్థులు ఒకవైపు, అవి లేని విద్యార్థులు మరోవైపు ఉండేలా విభజనను ఇది తీసుకువస్తుందని వారు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ నుంచి కొన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తున్నా విద్యారంగం ఇప్పటికీ మూతపడే ఉంది. గ్రామీణ విద్యార్థులు, పట్టణ ప్రాంత పేదలు డిజిటల్‌ తరగతులకు హాజరుకావడంలో ఎదుర్కొనే ఇబ్బందులను పరిష్కరించకుండా ముందుకు వెళ్లడం వల్ల చివరకు పీడకలే మిగులుతుందని దిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ ఆచార్యుడు విశ్లేషించారు. ఆయనతో సహా నలుగురు ఆచార్యులు ఈ విషయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు.
డిజిటల్‌ సేవా కేంద్రాలను వినియోగించుకోవచ్చు
స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు లేనివారు డిజిటల్‌ సేవా కేంద్రాల సేవలను వినియోగించుకోవచ్చు. వాటి ద్వారా వర్క్‌షీట్లను విద్యార్థులకు పంపించాలి. పూర్తి చేశాక మళ్లీ అవే కేంద్రాల ద్వారా వెనక్కి రప్పించుకోవచ్చు.
-నందన్‌ నీలేకని, ఇన్ఫోసిస్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌
పాఠశాలల్లో షిఫ్ట్‌ విధానం ఉండాలి
పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాక.. షిఫ్ట్‌ పద్ధతిలో తరగతులు నిర్వహించాలి. తద్వారా విద్యా సంస్థల్లో కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చు. కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రస్తుతం సాధారణ తరగతులు జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ బోధన మేలు. ఇది మరింత మెరుగైన పద్ధతిలో ఉండాలి. పరస్పర సంభాషణ మరింత ఎక్కువగా సాగాలి. అప్పుడు విద్యార్థులకు ఎక్కువ విజ్ఞానం సమకూరుతుంది. విద్యా రంగంలో సంస్కరణలు అవసరం. మూస పద్ధతిలో బోధన సాగుతోంది. దీని స్థానంలో ప్రాజెక్టు ఆధారిత బోధన విధానం ఉండాలి. విద్యార్థులు ఇళ్లల్లోనే ప్రాజెక్టు వర్క్‌లను చేపట్టేలా చూడాలి.
- వి.కె.సారస్వత్‌, నీతి ఆయోగ్‌ సభ్యుడు