• facebook
  • whatsapp
  • telegram

తరగతుల్లేకుండా పరీక్షలా?

* ఎంబీబీఎస్‌ విద్యార్థుల్లో ఆందోళన
* షెడ్యూల్‌ విడుదల చేసిన విశ్వవిద్యాలయం

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే : తరగతులు, ప్రయోగాలు లేకుండానే ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించామని చెప్పి, మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు సెప్టెంబరులో ఉంటాయని ప్రకటన జారీ చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
విశ్వవిద్యాలయం 2019-20 విద్యాసంవత్సరంలో 28 కళాశాలల్లో 3వేల మందికి ఎంబీబీఎస్‌ కోర్సులో ప్రవేశాలు ఇచ్చింది. వీరికి ఈ ఏడాది చివరన వార్షిక పరీక్షలు నిర్వహించాలి. లాక్‌డౌన్‌తో నాలుగు నెలల పాటు కళాశాలలు నిర్వహించలేదు. జులై తర్వాత ఎప్పుడు నిర్వహించేదీ వెల్లడిస్తామని వర్సిటీ పేర్కొంది. ఈ క్రమంలో కళాశాలలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాయి. ఇంతలోనే పరీక్షల షెడ్యూలు ప్రకటించింది. సాధారణ డిగ్రీలు ఆన్‌లైన్‌ తరగతులతో గట్టెక్కినా ప్రయోగాలు లేకుండా ఎంబీబీఎస్‌ పరీక్షలు ఎలా రాస్తారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విశ్వవిద్యాలయం పునరాలోచించాలని కోరుతున్నారు.
ఆన్‌లైన్‌ తరగతుల బాధ్యత కళాశాలలదే..
లాక్‌డౌన్‌లో విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని వైద్య కళాశాలలకు ఆదేశాలిచ్చాం. విద్యార్థుల హాజరు బాధ్యత విద్యా సంస్థలదే. దేశవ్యాప్తంగా పరీక్షల షెడ్యూల్‌ ముందే ప్రకటిస్తారు. ఆ మేరకే నిర్ణయించాం. ఆన్‌లైన్‌ తరగతులు విద్యార్థులు ఏ మేరకు విన్నారో తెలిపే నివేదికలు రాలేదు. ఆయా ప్రిన్సిపాళ్లతో మాట్లాడి.. తర్వాత పరీక్షల నిర్వహణపై తుదినిర్ణయం ప్రకటిస్తాం.