• facebook
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు మొదటిదశలో ఆన్‌లైన్‌ పాఠాలే

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ నూతన విద్యా సంవత్సరం ప్రారంభంలో కొన్నాళ్లు ఆన్‌లైన్‌ బోధన జరపాలని ఉన్నత విద్యామండలి, జేఎన్‌టీయూహెచ్‌ భావిస్తున్నాయి. కళాశాలలు ఇందుకు సమాయత్తం కావాలని అధికారులు యాజమాన్యాలకు సూచించారు. జూన్ 10న‌ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, జేఎన్‌టీయూహెచ్‌ ఇన్‌ఛార్జి ఉపకులపతి జయేశ్‌ రంజన్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ తదితరులు ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలతో కాలేజీల ప్రారంభంపై ఆన్‌లైన్‌ ద్వారా చర్చించారు. సెప్టెంబరు 1 నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని, మొదట్లో పరిస్థితిని బట్టి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించవచ్చని, అవసరమైతే సిలబస్‌ తగ్గించాలని భావించారు. జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ ఇంటర్న్‌షిప్‌ పైనా ఆలోచించాల్సి ఉందన్నారు. మొదట బీటెక్‌ చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి పంపించాలని, మిగిలిన వారికి పరిస్థితులను బట్టి తర్వాత జరపవచ్చన్న దానిపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. తమకు ప్రభుత్వం నుంచి బోధనా రుసుం సకాలంలో వచ్చేలా చూడాలని కళాశాలల యాజమాన్యాలు విన్నవించాయి.