• facebook
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్‌లోనే భళా!

* తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ ఐఐటీ, హెచ్‌సీయూల సత్తా
 

ఈనాడు, దిల్లీ: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) కింద కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ ప్రకటించిన ఉన్నత విద్యాసంస్థల ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు పెద్దగా సత్తా చాటలేకపోయాయి. మొత్తం 10 విభాగాల్లో 760 ర్యాంకులు ప్రకటించగా.. అందులో ఇరు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు 58 ర్యాంకులు దక్కాయి. వీటిలో తెలంగాణలో విద్యాసంస్థలకు 28, ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాసంస్థలకు 30 ర్యాంకులు దక్కాయి. ఇంజినీరింగ్‌లో వచ్చిన 25 ర్యాంకులను మినహాయిస్తే.. మిగతా తొమ్మిది విభాగాల్లో ప్రకటించిన 560 ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల విద్యాసంస్థలకు దక్కింది కేవలం 33 మాత్రమే. ఓవరాల్‌, యూనివర్సిటీ, ఇంజినీరింగ్‌ విభాగాల్లో మన విద్యాసంస్థల ప్రతిభ గుర్తించదగిన స్థాయిలో ఉన్నప్పటికీ మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ, లా, మెడికల్‌, ఆర్కిటెక్చర్‌, డెంటల్‌, కళాశాలల విభాగాల్లో తీసికట్టుగా ఉన్నట్లు ఆ విభాగాల్లో వచ్చిన ర్యాంకులు చాటుతున్నాయి. ఇంజినీరింగ్‌ విభాగంలో హైదరాబాద్‌ ఐఐటీ, ఓవరాల్‌, యూనివర్సిటీల విభాగంలో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) తెలుగు రాష్ట్రాల్లో టాప్‌లో నిలిచాయి. ఫార్మసీ విభాగంలో హైదరాబాద్‌లోని జాతీయ ఔషధ విద్య, పరిశోధన మండలి (నైపర్‌) దేశంలో అయిదో స్థానంలో, దక్షిణ భారతంలో మొదటి స్థానంలో నిలిచింది. బోధన, అభ్యాసం, పరిశోధన, ఫలితాలు, ప్రజాదరణలో మంచి స్కోరు సాధించింది.
సత్తా చాటిన ఐఐటీలు
కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ జూన్ 11న‌ ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ జాతీయ ర్యాంకులను విడుదల చేశారు. వీటిలో అత్యధిక ర్యాంకులను ఐఐటీలు కొల్లగొట్టాయి. ఓవరాల్‌ పెర్ఫార్మెన్స్‌ విభాగంలో ప్రకటించిన టాప్‌-10 ర్యాంకుల్లో 8 ఐఐటీలే చేజిక్కించుకున్నాయి. ఓవరాల్‌ విభాగంలో మద్రాస్‌ ఐఐటీ, యూనివర్సిటీల విభాగంలో బెంగళూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ తొలి స్థానాల్లో నిలిచాయి. దేశంలో మొదటి మూడు విశ్వవిద్యాలయాలుగా బెంగళూరు ఐఐఎస్‌సీ, జేఎన్‌యూ, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ నిలిచాయి. మొదటి మూడు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ దిల్లీ, ఐఐటీ బాంబే నిలిచాయి.
పది విభాగాల్లో ర్యాంకుల ప్రకటన
ఓవరాల్‌, యూనివర్సిటీలు, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ, కాలేజ్‌, మెడికల్‌, లా, ఆర్కిటెక్చర్‌, డెంటల్‌ విభాగాల్లో ర్యాంకులు ప్రకటించారు. గతేడాది వరకు 9విభాగాల్లో విద్యాలయాల పనితీరును మదించగా ఈసారి 10వ కేటగిరీకింద డెంటల్‌ను చేర్చారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 200, ఓవరాల్‌, యూనివర్సిటీలు, కళాశాలలభాగంలో100 చొప్పున, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీలలో 75చొప్పున, మెడికల్‌లో 40, ఆర్కిటెక్చర్‌, లాలో 20చొప్పున, డెంటల్‌ విభాగంలో 30 ర్యాంకులు ప్రకటించారు.