• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌ కోర్సుల దిశగా ఆస్కి

ఛైర్మన్‌ పద్మనాభయ్య వెల్లడి
 

ఈనాడు, హైదరాబాద్‌: అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కి) సంస్థాగతంగా మార్పులు చేయాలని నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో తరగతి గదుల్లో పాఠాల బోధనకు అవకాశం లేనందున ఆన్‌లైన్‌ కోర్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతిష్ఠాత్మక సంస్థలు, వృత్తి నిపుణులతో కలిసి పనిచేయడానికి సిద్ధమవుతోంది. జూన్ 11న‌ ఆస్కి ఉన్నతాధికారులు, బోధకులతో ఛైర్మన్‌ పద్మనాభయ్య సమీక్ష నిర్వహించారు. కరోనాతో ఈ ఏడాదికి ఆస్కికి రూ.22 కోట్ల లోటు ఏర్పడిందన్నారు. కరోనా సృష్టించిన ఈ వాతావరణాన్ని అవకాశంగా మలచుకుని ముందుకు సాగకపోతే దేశాలు, సంస్థలు, వ్యక్తులకు మనుగడ లేదన్నారు. దేశంలోని వివిధ ప్రభుత్వాలకు మేధో నిధిగా ఉన్న ఆస్కి ఈ క్లిష్ట సమయంలో బాధ్యతను మరింత సమర్థంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టిందన్నారు.‘‘మారిన పరిస్థితులకు తగినట్లుగా శిక్షణ, పరిశోధన అవకాశాలు అన్వేషించాలి. వినూత్న ఆలోచనలతో ప్రభుత్వాలకు, సంస్థలకు అవసరమైన కోర్సులు రూపొందించాలి. విధానాల రూపకల్పన, కార్యక్రమాల అమలు, మదింపులో పాలుపంచుకోవాలి. వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం పెంచుకుని ముందుకు సాగాలి. గడ్డుకాలంలో సంస్థ ప్రయోజనం, భవిష్యత్తు దృష్ట్యా గట్టినిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది’’ అని పద్మనాభయ్య తెలిపారు.