• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ ఫలితాలకు 3 గంటల ఉత్కంఠ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో మొదటిసారి ఆన్‌లైన్‌లో ఫలితాలను విడుదల చేసిన ఇంటర్‌ విద్యామండలి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వృత్తి విద్య, ప్రైవేటు, సాధారణ విద్యార్థులు కలిపి 10.64 లక్షల మంది పరీక్షలు రాశారు. ఇందుకు తగ్గట్టు సర్వర్లను ఏర్పాటు చేసుకోకపోవడంతో దాదాపు 3గంటలపాటు విద్యార్థులు నిరీక్షించాల్సి వచ్చింది. సర్వర్‌ సమస్యతోఎక్కడా వెబ్‌సైట్లు పని చేయనందున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠకు లోనయ్యారు. మొదటి సంవత్సరం ఫలితాలు రాత్రి ఏడింటికి, రెండో ఏడాది ఫలితాలు 7.40 గంటలకు అందుబాటులోకి వచ్చాయి.
పునర్‌లెక్కింపునకు గడువు 22
మార్కుల పునర్‌లెక్కింపు, జవాబుపత్రం స్కానింగ్‌, పునర్‌ పరిశీలనకు ఆన్‌లైన్‌లోనే రుసుములు చెల్లించాలని మండలి సూచించింది. 22లోపు పునర్‌లెక్కింపునకు రూ.260, స్కానింగ్‌ పత్రాల కోసం రూ.1,300 చెల్లించాలని పేర్కొంది. అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఫలితాలపై అభ్యంతరాలుంటే 18002749868 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయాలని, 9391282578కు వాట్సప్‌ చేయాలని సూచించింది.
*  ఇంటర్‌లో విద్యార్థులు ఎక్కువగా ఎంపీసీ గ్రూపుపైనే మోజు చూపుతున్నారు. రెండో సంవత్సరంలో మొత్తం 4,35,655 మంది పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 2,46,367 మంది ఎంపీసీవారే ఉన్నారు. ఆ తర్వాత బైపీసీ విద్యార్థులే అధికంగా ఉన్నారు. ఈ గ్రూపు నుంచి 90,163 మంది పరీక్షకు హాజరయ్యారు.
తగ్గిన ఉత్తీర్ణత: ఇంటర్‌ రెండో సంవత్సరం ఉత్తీర్ణత గతేడాదితో పోల్చితే 9శాతం తగ్గింది. 2019లో 72శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ఈసారి 63శాతం మందే ఉత్తీర్ణులయ్యారు.