• facebook
  • whatsapp
  • telegram

బాలికలదే హవా

* ఇంటర్‌ ఫలితాల్లో 64, 67శాతాలతో ముందంజ
* మొదటి ఏడాది మొత్తం ఉత్తీర్ణత 59%
* రెండో సంవత్సరం ఉత్తీర్ణత 63%

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ఈసారీ బాలికల ఆధిక్యం కొనసాగింది. మొదటి ఏడాది మొత్తం 5,07,230 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 3,00,560 మంది (59శాతం) ఉత్తీర్ణత సాధించారు. రెండో ఏడాది 4,35,655 మంది పరీక్షలు రాయగా 2,76,389 మంది (63శాతం) ఉత్తీర్ణులయ్యారు.మొదటి ఏడాది బాలికల్లో 64 శాతం, బాలురలో 55 శాతం, ద్వితీయ సంవత్సరంలో బాలికలు 67 శాతం, బాలురు 60 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను జూన్ 12న‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొవిడ్‌-19 సమయంలో దేశంలోనే ప్రప్రథమంగా ఇంటర్‌ ఫలితాలనిచ్చామని వెల్లడించారు.  కరోనా నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకొని పది, డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా నిర్వహిస్తామన్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు విద్యార్థుల మార్కులు, గ్రేడ్లతో ప్రచారం నిర్వహించకూడదని మంత్రి సురేష్‌ హెచ్చరించారు. మొదటి ఏడాది వారికి మార్కులివ్వగా, రెండో ఏడాది వారికి గ్రేడ్లు ఇచ్చారు. మార్కులు, గ్రేడ్‌లతో కూడిన మార్కుల జాబితాను ఈనెల 15నుంచి ఇంటర్‌ విద్యామండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. రాత్రి ఏడు గంటల వరకు సర్వర్‌ ఇబ్బందులు తలెత్తాయి.
కృష్ణా ప్రథమం.. శ్రీకాకుళం అట్టడుగున
ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సర ఫలితాల్లో కృష్ణా జిల్లానే ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో ఏడాది ఫలితాల్లో కృష్ణా జిల్లా 75 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, శ్రీకాకుళం 52శాతంతో అట్టడుగున నిలిచింది. మొదటి ఏడాదిలో కృష్ణాజిల్లా 75 శాతం, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలు 65శాతం, విశాఖపట్నం 63శాతంతో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. కర్నూలు 51శాతం, శ్రీకాకుళం 50శాతం, కడప, అనంతపురం జిల్లాలు 47శాతంతో చివరి స్థానాల్లో నిలిచాయి.
అనంత, తూర్పుగోదావరి ప్రభుత్వ కళాశాలల్లో 37శాతమే ఉత్తీర్ణత
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విభాగంలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 45శాతం, 60శాతంతో ప్రతిభ చూపింది. రెండో ఏడాదిలో ఉత్తీర్ణత సరాసరి 63శాతం ఉండగా ప్రభుత్వ కళాశాలల్లో 60 శాతాన్ని మించలేదు. అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలలోని జూనియర్‌ కళాశాలల్లో 37శాతం, గుంటూరులో 38శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
ద్వితీయంలో కృష్ణా ప్రథమం.. శ్రీకాకుళం అట్టడుగున
ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సర ఫలితాల్లో కృష్ణా జిల్లానే ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో ఏడాది ఫలితాల్లో కృష్ణా జిల్లా 75 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, శ్రీకాకుళం 52శాతంతో అట్టడుగున నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా 71శాతం, నెల్లూరు, విశాఖపట్నం 68శాతంతో ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచాయి. అనంతపురం 54శాతం, కడప 53, శ్రీకాకుళం 52శాతంతో చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి.
మొదటి సంవత్సరంలో అట్టడుగున కడప, అనంతపురం
ఇంటర్‌ మొదటి ఏడాదిలో కృష్ణా జిల్లా 75 శాతం, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలు 65శాతం, విశాఖపట్నం 63శాతంతో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. కర్నూలు 51శాతం, శ్రీకాకుళం 50శాతం, కడప, అనంతపురం జిల్లాలు 47శాతంతో చివరి స్థానాల్లో నిలిచాయి.