• facebook
  • whatsapp
  • telegram

పాఠశాలల ప్రాంగణాల్లో ఇతర నిర్మాణాలొద్దు

* అధికారులకు హైకోర్టు ఆదేశం
 * చట్ట నిబంధనలకు కట్టుబడాలని ప్రభుత్వానికి హితవు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ/స్థానిక సంస్థల పాఠశాలల ప్రాంగణాల్లో ఇతర నిర్మాణాలకు తావివ్వొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది. పాఠశాల ప్రాంగణంలో గ్రామ సచివాలయ భవన నిర్మాణ యత్నం.. ఏపీ విద్యా చట్టం, జాతీయ విద్యా విధానం, అధికరణ 21, 21-ఏకు విరుద్ధమని తేల్చిచెప్పింది. అధికరణ 21-ఏ విద్యా హక్కును కల్పిస్తోందని గుర్తుచేసింది. విద్యా హక్కులోనే పారిశుద్ధ్యం, ఆటస్థలం, ఆరోగ్యకర వాతావరణం, సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య పొందే హక్కు ఇమిడి ఉందని పేర్కొంది. విశాఖ జిల్లా చీడికాడ మండలం తిరువోలులోని మండల ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఇతర నిర్మాణ పనులు చేపట్టొద్దంటూ ఆదేశించింది. ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఈ వ్యవహారంలో విద్యార్థుల ప్రయోజనాలు ముడిపడి ఉన్నందున.. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్య కమిషనర్‌, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, డైరెక్టర్‌ను వ్యాజ్యంలో సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. తిరువోలులోని పాఠశాల ఆటస్థలంలో గ్రామ సచివాలయ భవన నిర్మాణం చేపట్టనున్నారని, అందుకోసం పురాతనమైన చెట్లను కొట్టేస్తున్నారని పూర్వ విద్యార్థి కోటేశ్వరరావు, మరో 11 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపులా వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. రాష్ట్ర ప్రభుత్వం చట్ట నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నారు.