• facebook
  • whatsapp
  • telegram

హైదరాబాద్‌ వచ్చి రాసేదెలా?

* ఎంసెట్‌ పరీక్ష కేంద్రం మార్పునకు అవకాశం లేక విద్యార్థుల ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌ ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పరీక్ష కేంద్రం మార్పునకు అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జూన్ 11 నుంచి ఎంసెట్‌ దరఖాస్తుల్లో సవరణలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. తెలంగాణ జిల్లాల నుంచి వేలాదిమంది విద్యార్థులు హైదరాబాద్‌, శివారు ప్రాంతాలకు వలస వచ్చి కళాశాలలు, వసతి గృహాల్లో ఉంటూ ఇంటర్మీడియట్‌ చదువుతుంటారు. కొందరు ఎంసెట్‌ కోచింగ్‌ తీసుకుంటుంటారు. కరోనా కారణంగా విద్యాసంస్థలు, వసతి గృహాలు మూతపడ్డాయి. విద్యార్థులందరూ సొంత జిల్లాలకు వెళ్లిపోయి అక్కడే ఉండి ఎంసెట్‌కు సన్నద్ధమవుతున్నారు. గతంలో ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న సమయంలో హైదరాబాద్‌ను పరీక్ష కేంద్రంగా ఎంచుకున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో హైదరాబాద్‌కు వచ్చి రెండుమూడు రోజులు ఇక్కడే ఉండి పరీక్షలు రాయాలంటే కష్టమని వాపోతున్నారు. సొంత జిల్లాల్లోనే పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. జేఈఈ-మెయిన్స్‌లో పరీక్ష కేంద్రం మార్పునకు అనుమతించారు. ఎంసెట్‌లో అలా ఎందుకు చేయరని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.