• facebook
  • whatsapp
  • telegram

విదేశీ విద్య తాత్కాలిక వాయిదా

* ఆన్‌లైన్‌ తరగతులపై ఆసక్తి తక్కువే
* ఉద్యోగం, ఉపాధి కోర్సులపైనే  విద్యార్థుల దృష్టి

ఈనాడు, అమరావతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించాలన్న ప్రణాళికలను విద్యార్థులు తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏదో ఒక ఉద్యోగం, కోర్సులో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. పరిస్థితులు చక్కబడ్డ తరవాత విదేశాలకు వెళ్లాలని భావిస్తున్నారు. విదేశీ విద్య విచారణల కోసం వస్తున్న వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది.  దీంతో విదేశాలకు వెళ్లాల్సిన విద్యార్థులతో కళకళలాడాల్సిన కన్సల్టెన్సీలు ప్రస్తుతం బోసిపోతున్నాయి. అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో ఆగస్టు, సెప్టెంబరులో జరిగే(ఫాల్‌) ప్రవేశాలు ఈసారి ఆన్‌లైన్‌కే పరిమితమయ్యాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారిలో 30శాతం మంది మాత్రమే ఆన్‌లైన్‌పై మక్కువ చూపుతున్నట్లు కన్సల్టెన్సీలు పేర్కొంటున్నాయి. ఆన్‌లైన్‌ తరగతులకు 42శాతం నుంచి 50శాతం రుసుములు వసూలు చేస్తాయి.
వచ్చే సెమిస్టర్‌కు చూద్దాం..
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అన్ని దేశాల విశ్వవిద్యాలయాలు ఆఫ్‌లైన్‌ తరగతులకు బదులు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలని నిర్ణయించాయి. సాధారణంగా తెలుగు విద్యార్థులు నేరుగా ఆయా దేశాలకు వెళ్లే చదువుకునేందుకే ఇష్టపడతారు. దీంతో ఆన్‌లైన్‌ ప్రవేశాల వైపు పెద్దగా మొగ్గు చూపడం లేదు. జనవరి-ఏప్రిల్‌లో జరిగే స్ప్రింగ్‌కు వాయిదా వేసుకుంటున్నారు. సాధారణ పరిస్థితుల్లో ఏటా ఫాల్‌లో 3వేల మందిని చదువు కోసం విదేశాలకు పంపేవారమని, ఇప్పుడు ఆన్‌లైన్‌కు కేవలం 800మంది మాత్రమే నమోదు చేసుకున్నారని గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌ల్లో బ్రాంచిలు కలిగిన వరల్డ్‌ వైడ్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీ ఎండీ ఉడుముల వెంకటేశ్వరరెడ్డి వెల్లడించారు. విద్యార్థులు విదేశీ చదువులను వాయిదా వేసుకుంటున్నారని, ఆన్‌లైన్‌కు వస్తున్న వారు 30శాతం మించడం లేదని గుంటూరు కేంద్రంగా పని చేస్తున్న అబ్రాడ్‌ కన్సల్టెన్సీ ప్రతినిధి పార్థసారథి తెలిపారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ ప్రవేశాలు తీసుకుంటున్న వారు వచ్చే సెమిస్టర్‌లో ఆఫ్‌లైన్‌కు ప్రాధాన్యం లభిస్తుందని భావిస్తున్నారు. ఫాల్‌కు మన దేశం నుంచి సుమారు 1.40లక్షల మంది విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు వెళ్తారు.
ఉద్యోగం కోసం ప్రయత్నం
‘అమెరికా వెళ్లి చదువుకోవాలనుకున్నా. గతేడాది వీసా రాకపోవడంతో తాత్కాలికంగా ఉద్యోగంలో చేరా.  ఈ ఏడాది వెళ్లేందుకు ఉద్యోగాన్ని వదులుకున్నా. లాక్‌డౌన్‌ కారణంగా వెళ్లే అవకాశం లేదు. మళ్లీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నా’
- తేజస్వీ, బీటెక్‌, గుంటూరు