• facebook
  • whatsapp
  • telegram

వైద్య విద్యార్థులకు.. ‘బొమ్మల’తో ప్రాక్టికల్స్‌!

ఈనాడు, హైదరాబాద్‌: వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అధ్యాపకులు సాధారణంగా రోగులను చూపిస్తూ, వారి వ్యాధి లక్షణాలను వివరిస్తూ ప్రాక్టికల్స్‌ చేయిస్తారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులు కరోనా నేపథ్యంలో చికిత్స కోసం ఆస్పత్రులకు రాని పరిస్థితి ఉంది. వచ్చినా.. వారిని తాకే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఏ ఏడాది పీజీ డిగ్రీ, డిప్లొమా వైద్య విద్యార్థులకు మనుషులను పోలిన బొమ్మలతో ప్రాక్టికల్‌ పరీక్షలు చేయించాలని భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) నిర్ణయించింది. ఈ మేరకు బొమ్మల మాదిరి నమూనాలను వినియోగిస్తూ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహించవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. పీజీ వైద్య విద్య ప్రాక్టికల్‌ పరీక్షల్లో ఒక్కో విద్యార్థి కనీసం ఇద్దరు రోగులను పరీక్షిస్తూ అధ్యాపకులకు అనుభవపూర్వకంగా వివరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రోగులు ఆస్పత్రులకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో.. బొమ్మల నమూనాలతో ప్రాక్టికల్స్‌ నిర్వహించుకోవచ్చని ఎంసీఐ వెసులుబాటు కల్పించింది.