• facebook
  • whatsapp
  • telegram

మూడు నెలల్లోపే డాక్టరేట్‌ పట్టా

* థీసిస్‌ సమర్పణ నుంచి అవార్డు పొందే గడువును తగ్గించిన హెచ్‌సీయూ

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఫిల్‌/పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథం(థీసిస్‌) ఆన్‌లైన్‌లో సమర్పించే అవకాశంతో పాటు థీసిస్‌ సమర్పణ నుంచి పీహెచ్‌డీ అవార్డు పొందే గడువును మూడు నెలలకు తగ్గించింది. గతంలో థీసిస్‌ను పుస్తక రూపంలో ఎగ్జామినర్లకు పోస్టు ద్వారా పంపేవారు. ఎగ్జామినర్లు వాటిని చూసిన అనంతరం ప్రత్యక్షంగా విద్యార్థులకు వైవా నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో విద్యార్థులు విశ్వవిద్యాలయానికి వచ్చే వీలు లేకపోవడంతో థీసిస్‌లను ఆన్‌లైన్‌లో సమర్పించేందుకు వెసులుబాటు కల్పించారు. థీసిస్‌ను ఈ-గవర్నెన్స్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశాక, మూల్యాంకనం కోసం ఎంపిక చేసిన బయటి ఎగ్జామినర్‌కు ఈ-మెయిల్‌ ద్వారా పంపుతారు. ఎగ్జామినర్‌ నిర్దేశిత సమయంలోగా తన పని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా జరగకుంటే మరో ఎగ్జామినర్‌కు అందజేస్తారు. అక్కడ మూల్యాంకనం పూర్తయ్యాక, ఆన్‌లైన్‌లో వైవా నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. ఇలా ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 20 మందికి వైవా నిర్వహించారు. ‘కాగిత రహిత చర్యల్లో భాగంగా ఎం.ఫిల్‌/ పీహెచ్‌డీ విద్యార్థులకు కొన్ని వెసులుబాట్లు కల్పించాం. గతంలో డాక్టరేట్‌ అవార్డు అయ్యేందుకు ఆరు నెలల గడువు ఉండగా దాన్ని మూడు నెలలకు తగ్గించాం. విద్యార్థుల ముందస్తు సమర్పణ ఉపన్యాసాలకు అనుమతించాం’ అని హెచ్‌సీయూ ఉపకులపతి ప్రొ.పొదిలె అప్పారావు ‘ఈనాడు’కు తెలిపారు.