• facebook
  • whatsapp
  • telegram

నెలాఖరుకు మార్కెట్లోకి పాఠ్య పుస్తకాలు

ఈనాడు, హైదరాబాద్‌ : ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం ఈనెలాఖరుకు కొత్త పాఠ్య పుస్తకాలు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 60 లక్షల మంది విద్యార్థుల్లో 33 లక్షల మంది ప్రైవేట్‌ బడుల్లో చదువుతున్నారు. వారిలో రాష్ట్ర సిలబస్‌ చదివే 6-10 తరగతుల విద్యార్థులు తప్పనిసరిగా విద్యాశాఖ ముద్రించిన పాఠ్య పుస్తకాలను వినియోగించాలి. గత ఏడాది మాదిరిగా పుస్తకాల ధరలు ఉన్నాయని, పెంచలేదని విద్యాశాఖ వర్గాలు స్పష్టంచేశాయి. ఈసారి 8, 9 తరగతుల గణితం, సైన్స్‌, సాంఘికశాస్త్ర పుస్తకాల్లో క్యూఆర్‌ కోడ్‌ ముద్రించారు. ఎస్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్లో గత ఏడాది పాఠ్య పుస్తకాల పీడీఎఫ్‌లను ఉంచారు. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. స్వల్ప మార్పులు, చేర్పులతో వచ్చే విద్యా సంవత్సరానికి(2020-21) ముద్రించిన కొత్త పుస్తకాలను త్వరలో ఆ వెబ్‌సైట్లో ఉంచనున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఇప్పటికే జిల్లాలకు 82 శాతం పుస్తకాలు సరఫరా చేశారు. మిగిలినవి వారంలో జిల్లాలకు అందనున్నాయి. వాటిని ఉచితంగా పిల్లలకు ఇస్తారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో ముద్రించారు.
ఇదీ ఉచిత పుస్తకాల పరిస్థితి..
* అవసరమైనవి : 1.50 కోట్లు (26.37 లక్షల మంది విద్యార్థులు)
* జిల్లాలకు సరఫరా చేసినవి: 1.14 కోట్లు
* గత ఏడాది మిగిలి జిల్లాల్లో ఉన్నవి: 11 లక్షలు