• facebook
  • whatsapp
  • telegram

ఐఐటీల్లో డిసెంబరులోనే తొలి సెమిస్టర్‌!

* కేంద్రానికి ఐఐటీ కౌన్సిల్‌ ఉపసంఘం నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: ఈ విద్యాసంవత్సరం (2020-21)లో కొత్తగా బీటెక్‌లో చేరే విద్యార్థులకు డిసెంబరులో తరగతులు ప్రారంభించే యోచనలో ఐఐటీలున్నాయి. కరోనా నేపథ్యంలో ఐఐటీల పునఃప్రారంభం, ప్రత్యామ్నాయ మార్గాలపై కొంతమంది ఐఐటీ సంచాలకులతో ఐఐటీ కౌన్సిల్‌ నియమించిన ఉపసంఘం ఇటీవలే కేంద్ర మానవ వనరుల శాఖకు నివేదిక అందజేసింది. ఇందులో పలు సిఫార్సులు, సూచనలు చేసింది. దీని ప్రకారం ఏమాత్రం అవకాశం ఉన్నా పీహెచ్‌డీ విద్యార్థులను తొలుత ప్రాంగణాలకు రప్పిస్తారు. ఇంకొంత వెసులుబాటు ఉంటే ఈ సంవత్సరం చేరే విద్యార్థులకు అవకాశం ఇస్తారు. కొత్త విద్యార్థులకు డిసెంబరులో తరగతులు ప్రారంభమైనా శనివారాలు, ఇతర సెలవుల్లోనూ తరగతులు నిర్వహించి.. విద్యాసంవత్సరాన్ని గతంలోలా పూర్తయ్యేలా చూస్తారు. ఇక పాత విద్యార్థులకు మొదటి సెమిస్టర్‌ పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో బోధిస్తారు. ఉపసంఘం నివేదికపై కేంద్ర మావన వనరుల శాఖ మంత్రి ఛైర్మన్‌గా ఉండే ఐఐటీ కౌన్సిల్‌ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ భేటీ త్వరలోనే జరగవచ్చని ఐఐటీ సంచాలకుడు ఒకరు తెలిపారు.