• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌కు అదనపు ఫీజు వసూలు

* హెచ్‌ఎస్‌పీఏ సర్వేలో తల్లిదండ్రుల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించిన ప్రైవేట్‌ పాఠశాలలు ఆ పేరిట అదనంగా ఫీజు వసూలు చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులు, వాటి వల్ల ఉపయోగం, రుసుములు తదితర అంశాలపై హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌(హెచ్‌ఎస్‌పీఏ) ఆన్‌లైన్‌లో ఓ సర్వే నిర్వహించింది.  దాదాపు వెయ్యి మంది తల్లిదండ్రులు వివిధ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆన్‌లైన్‌ తరగతులు పేరు చెప్పి అదనంగా ఫీజులు అడుగుతున్నారని 20 శాతం మంది సమాధానమిచ్చారు. ఆ తరగతుల కోసం అవసరమైన స్మార్ట్‌ఫోన్‌/ల్యాప్‌టాప్‌/ట్యాబ్‌ తదితర పరికరాలను 51 శాతం మంది కొత్తగా కొన్నట్లు వెల్లడించారు. ఆర్థిక పరిస్థితి తారుమారైన పరిస్థితుల్లో అది తమకు అదనపు భారమైందని అభిప్రాయపడ్డారు. పిల్లలపై ప్రతికూల ప్రభావం తప్పదని 77 శాతం మంది ఆందోళన వ్యక్తంచేశారు. 5వ తరగతి వరకు ఆన్‌లైన్‌ వద్దని 76% మంది తెలిపారు.