• facebook
  • whatsapp
  • telegram

బడితెగింపు

*రాష్ట్రంలో పలు ప్రైవేట్‌ పాఠశాలల ఇష్టారాజ్యం
* ఫీజులు పెంచొద్దని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా బేఖాతరు
 * ఆన్‌లైన్‌ తరగతుల పేరిట ఈ ఏడాది ముందస్తు వసూళ్లు

ఈనాడు - హైదరాబాద్‌: కరోనా ఒకవైపు ఆర్థిక పరిస్థితుల్ని తారుమారు చేసినా...తల్లిదండ్రులపై పలు ప్రైవేట్‌ పాఠశాలల ఫీ‘జులుం’ ఆగడంలేదు. ట్యూషన్‌ ఫీజులు పెంచొద్దని ప్రభుత్వం జీవో ఇచ్చినా...యాజమాన్యాలు రకరకాల పేర్లతో అధికంగా గుంజుతూనే ఉన్నాయి. అనేక ఇంటర్నేషనల్‌ పాఠశాలలు 10-15 శాతం పెంచి మరీ వసూలు చేస్తున్నాయి. నెలవారీగా ఫీజులు తీసుకోవాలని ఆదేశించినా అధిక శాతం పాఠశాలలు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాయి. ఎల్‌కేజీ విద్యార్థులకూ ఆన్‌లైన్‌ తరగతులంటూ వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. ఇంతేసి రుసుములు ఎలా చెల్లించాలంటూ పలు పాఠశాలల ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగుతున్నా యంత్రాంగం కదలడం లేదు.
ఒకవైపు కరోనా ఎక్కడ కాటేస్తుందోనని భయం...ఉద్యోగాలు ఎప్పుడు ఊడతాయోనని ఆందోళన... వ్యాపారాల పరిస్థితీ దారుణం. ఫలితంగా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండగా...ప్రైవేట్‌ పాఠశాలల ఫీజుల వ్యవహారం తల్లిదండ్రులకు నిద్ర పట్టకుండా చేస్తోంది. గ్రామీణ జిల్లాల్లో సమస్య తీవ్రత తక్కువగా ఉన్నా... హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం యాజమాన్యాలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలు తమకు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు వర్తించవన్నట్లు వ్యవహరిస్తున్నాయి. దానికితోడు ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ తరగతుల్ని ప్రారంభించడంతో ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు భారం పడుతోందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
సగం పాఠశాలలు పెంచాయి
రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరంలో బడి రుసుములు పెంచొద్దని, గత విద్యా సంవత్సరం ఫీజులే తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గత మార్చిలో జీవో 46 జారీ చేసింది. రాష్ట్ర విద్యాశాఖతో పాటు సీబీఎస్‌ఈ తదితర అన్ని బోర్డుల పాఠశాలలకు ఇది వర్తిస్తుంది. అధిక శాతం పాఠశాలలు ఈ జీవో నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. కేవలం ట్యూషన్‌ ఫీజును మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా... దాంతోపాటు ఇతర పలు రకాలు ఫీజులను గుంజుతున్నాయి. దాదాపు సగం పాఠశాలలు ఫీజులు పెంచేశాయి.
కార్పొరేట్‌ ముందస్తు జాగ్రత్త
కార్పొరేట్‌ విద్యాసంస్థల పాఠశాలల దందా మరో రకంగా ఉంది. ఫీజులు పెంచడంతో పాటు సగం చెల్లిస్తేనే ఆన్‌లైన్‌ తరగతులకు అనుమతిస్తామని తెగేసి చెబుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక టర్మ్‌ ఫీజు అయినా చెల్లించాలని పట్టుబడుతున్నాయి. కొన్ని చోట్ల మొత్తం రుసుం ఒకేసారి చెల్లించాలని బలవంత పెడుతున్నాయి.
మొదటిసారి నోటీసులు
ఫీజులు పెంచితే ఫోన్లు చేసి ఫిర్యాదు చేయాలని డీఈవోలు సైతం ఫోన్‌ నంబర్లు ఇచ్చారు. రంగారెడ్డి డీఈవో కార్యాలయానికి ఇప్పటివరకు తొమ్మిది పాఠశాలలపై ఫిర్యాదులొచ్చాయని అధికారులు తెలిపారు. ఆ పాఠశాలలకు షోకాజు నోటీసులు జారీ చేశారు. రెండోసారి ఫిర్యాదు అందితే అనుబంధ గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించామని వారు చెప్పారు. సీబీఎస్‌ఈ పాఠశాలలపైనే ఫిర్యాదులు అందుతున్నాయని చెబుతున్నారు. జిల్లాల్లో అందిన ఫిర్యాదుల సమాచారం కూడా కమిషనర్‌ కార్యాలయం సేకరించకపోవడం గమనార్హం. ఇప్పటివరకు గత ఏడాది ట్యూషన్‌ ఫీజు ఎంత అన్న వివరాలు కూడా పూర్తిగా విద్యాశాఖ వద్ద లేవు.
ఇదీ తల్లిదండ్రుల గోడు
* జేఎన్‌టీయూహెచ్‌ సమీపంలోని ఒక వ్యక్తి తన ఇద్దరు పిల్లలను చిన్న పాఠశాల నుంచి ఈ ఏడాది ఓ కార్పొరేట్‌ స్కూలులో చదివించాలని అక్కడికి వెళ్లారు. గత ఏడాది 6వ తరగతికి రూ.65 వేలు తీసుకోగా...ఈసారి రూ.70 వేలు అడిగారు.
* శేరిలింగంపల్లి సమీపంలోని ఓ ఇంటర్నేషనల్‌ పాఠశాల 10 శాతం ఫీజు పెంచుతున్నట్లు ఏకంగా వెబ్‌సైట్లోనే ఉంచింది. దాంతో ఒక్కో విద్యార్థిపై ఈసారి రూ.10 వేల నుంచి రూ.25 వేల భారం పడింది. దీనిపై విద్యాశాఖకు ఫిర్యాదులు కూడా అందాయి.
* ఎల్‌బీనగర్‌లోని ఓ పాఠశాల గత ఏడాది ఒకటో తరగతి పుస్తకాల కోసం రూ.2,200 వసూలు చేయగా ..ఈసారి రెండో తరగతి వచ్చేసరికి ఏకంగా రూ.4,400 చెల్లించాలంటున్నారని ఓ విద్యార్థి తండ్రి ఆవేదన చెందుతున్నారు.
* అనేక పాఠశాలలు ట్యూషన్‌ రుసుం పెంచితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందేమోనని పుస్తకాలు, యూనిఫాం తదితర వాటిపై భారీగా పెంచారు. మన్సూరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ పాఠశాల 10వ తరగతి మెటీరియల్‌, నోట్‌ పుస్తకాల కోసం రూ.9 వేలు చెల్లించాలని పట్టుబడుతోంది. పాఠ్య పుస్తకాల ఖర్చు అదనం.
* విద్యాశాఖ పట్టించుకోకపోవడంతో ఇటీవల అమీర్‌పేట, బంజారాహిల్స్‌, హిమాయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లోని ప్రముఖ పాఠశాలల వద్ద ఫీజులు తగ్గించాలని తల్లిదండ్రులు ఆందోళన చేశారు.
అశాస్త్రీయంగా ఆన్‌లైన్‌ తరగతులు
ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై పాఠశాలలకు ఒక విధానం లేకుండాపోయింది. శాస్త్రీయ విధానమేదీ లేకుండానే అనేక స్కూళ్లు ఫీజుల కోసమే అన్నట్లు తరగతులు మొదలుపెట్టాయి. ఆ పేరుతో మానసికంగా తల్లిదండ్రులను వేధిస్తున్నాయి. కర్ణాటకలో 5వ తరగతి వరకు ఆన్‌లైన్‌ తరగతులను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. అసలు ఈ తరగతులు ఉండాలా? ఉంటే ఏ క్లాసుకు ఎంత సమయం జరపాలి? అన్న దానిపై విద్యాశాఖ ఇప్పటివరకు ఒక విధానాన్ని రూపొందించలేదు. కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే అది చేద్దాం అన్న ధోరణిలో అధికార యంత్రాంగం ఉంది. మరోపక్క ఎల్‌కేజీ విద్యార్థులకూ ఆన్‌లైన్‌లో తరగతులు పెడుతున్నాయి. ఓ కార్పొరేట్‌ విద్యాసంస్థ పదో తరగతి విద్యార్థులకు ఉదయం 7.30 గంటలకే క్లాసులు మొదలుపెడుతోంది.
ఇదీ దందా...
* 51 శాతం పాఠశాలలు రుసుములు పెంచాయి. దాదాపు 99 శాతం పాఠశాలలు ట్యూషన్‌ ఫీజుతోపాటు ఇతర రుసుములను కలిపి వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌(హెచ్‌ఎస్‌పీఏ) ఇటీవల నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో తేలిన వాస్తవమిది.
* యాక్టివిటీ ఫీజులు కూడా అడుగుతున్నారని 38 శాతం మంది
* భోజనం ఫీజు అడుగుతున్నారని 17 శాతం
* గ్రంథాలయం ఫీజు ఇవ్వాలంటున్నారని 25 శాతం మంది తల్లిదండ్రులు స్పష్టం చేశారు.
* ఆన్‌లైన్‌ తరగతులంటూ అదనపు రుసుం వసూలు చేస్తున్నారని 20 శాతం మంది తేల్చిచెప్పారు.
రాష్ట్రంలో ఇదీ పరిస్థితి
* 1-10 తరగతి వరకు విద్యార్థుల సంఖ్య... 58 లక్షలు
*  వారిలో ప్రైవేట్‌ పాఠశాలలవారు... దాదాపు 32 లక్షలు
*  మొత్తం ప్రైవేట్‌ పాఠశాలల సంఖ్య... 11,500
*  హైదరాబాద్‌, మేడ్చల్‌,  రంగారెడ్డి జిల్లాల్లోనివి.. దాదాపు 4,500
*  నిబంధనలకు విరుద్ధంగా   ఫీజులు వసూలు చేస్తున్నవి... సుమారు 700 
(హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ అంచనా)
యంత్రాంగం నియంత్రణ లోపం
జీవోలిచ్చినా పాటించకుండా ప్రైవేట్‌ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయంటే.. ఇందుకు అధికార యంత్రాంగం నియంత్రణ లోపమే కారణం. ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదు. కనీసం పాఠశాల విద్యాశాఖకు పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించకపోవడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. వెంటనే కమిషనర్‌ను నియమించి డీఈవోలతో తనిఖీలు చేయించాలి. జీవో 46కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- వెంకట్‌, సంయుక్త కార్యదర్శి, హెచ్‌ఎస్‌పీఏ