• facebook
  • whatsapp
  • telegram

పది మంది పిల్లలనైనా చేర్పించాలి

* ప్రభుత్వ ఉపాధ్యాయులకు బడిబాట లక్ష్యం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలకు బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ప్రవేశాలకు సంబంధించి లక్ష్యాలను నిర్దేశించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీలు, గ్రామ, వార్డు వాలంటీర్ల సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారి పిల్లల్ని చేర్పించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కనీసం లక్ష చొప్పున కొత్త ప్రవేశాలు ఉండాలని లక్ష్యం నిర్దేశిస్తూ ఆయా జిల్లా విద్యాధికారులు జూన్ 27న  ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో ఉపాధ్యాయుడు సగటున 10 మంది విద్యార్థుల్ని బడిలో చేర్చాలని పేర్కొన్నారు. జులై 15 నాటికి బడిబాట కార్యక్రమాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు.