• facebook
  • whatsapp
  • telegram

ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ

* వాయిదా వేయాలని హైకోర్టులో వ్యాజ్యం
* నేడు కౌంటర్‌ దాఖలు చేయనున్న ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ కోర్సులకు సంబంధించి నిర్వహించే ప్రవేశ పరీక్షలపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించే ఆలోచనలో ఉండగా.. మరోవైపు కరోనా తీవ్రత నేపథ్యంలో వాటిని వాయిదా వేయాలని జూన్ 29న‌ ఒకరు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు కావడంతో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యాజ్యం మంగళవారం న్యాయస్థానంలో విచారణకు వచ్చే అవకాశం ఉందని భావించిన విద్యాశాఖ అధికారులు దానిపై కౌంటర్‌ దాఖలు చేయనున్నారు. పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి పాలిసెట్‌, ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి పీజీఈసెట్‌ జులై ఒకటిన జరగాలి. జులై 4న ఈసెట్‌, 6 నుంచి 9 వరకు ఎంసెట్‌...ఇలా వరుసగా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే జాతీయస్థాయి పరీక్షలైన ఎయిమ్స్‌, జిప్‌మర్‌తో పాటు హైదరాబాద్‌ ట్రిపుల్‌ఐటీలో ప్రవేశానికి పరీక్షలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. ప్రవేశ పరీక్షలు జరగకుంటే విద్యా సంవత్సరం నష్టపోతారని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష నిర్వహించడం తప్పనిసరని ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. ఏ విద్యార్థీ పరీక్షల వాయిదాను కోరుకోవడం లేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. లాక్‌డౌన్‌ విధించినా అది హైదరాబాద్‌ వరకే  కాబట్టి సమస్య ఉండకపోవచ్చని చెబుతున్నారు. పిల్‌ దాఖలైన నేపథ్యంలో మంగళవారం వెబ్‌సైట్‌లో ఉంచాల్సిన హాల్‌టికెట్లను ఒకరోజు ఆలస్యంగా అందులో పెట్టే అవకాశముంది.