• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌ తరగతులపై మీ విధానమేంటి?

* ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై ప్రభుత్వ విధానమేమిటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులను అనుమతిస్తారా? లేదో చెప్పాలంది. ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తూ టర్మ్‌ ఫీజులను వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైదరాబాద్‌ పాఠశాల తల్లిదండ్రుల సంఘం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం జులై 1న విచారణ చేపట్టింది. ప్రైవేటు పాఠశాలలను నియంత్రించాలని ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్‌ ధర్మాసనానికి తెలిపారు.
                  పిటిషనర్‌ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ రెండు మూడు జిల్లాల్లోనే జిల్లా విద్యాశాఖాధికారులు ఉత్తర్వులు జారీ చేశారని.. మిగిలిన జిల్లాల్లో ఆన్‌లైన్‌లో తరగతులు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించగా.. చట్టప్రకారం జిల్లా విద్యాశాఖాధికారులకే అధికారం ఉందని ప్రభుత్వ న్యాయవాది సమాధానమిచ్చారు. అలాంటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా విద్యాశాఖాధికారులందరూ ఉత్తర్వులు జారీ చేసేలా ఎందుకు ఆదేశించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకవేళ ఆన్‌లైన్‌ తరగతులకు అనుమతిస్తే ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్‌ సదుపాయం లేని పేదల మాటేమిటంది. పూర్తి వివరాలు తెలపడానికి గడువు కావాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అభ్యర్థించారు. దీంతో ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖాధికారులు, తెలంగాణ రిజిస్టర్డ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌లకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 8వ తేదీకి వాయిదా వేసింది.