• facebook
  • whatsapp
  • telegram

కేరళలో అందరికీ ఆన్‌లైన్‌ విద్యాబోధన

* రాష్ట్ర ప్రభుత్వ వినూత్న విధానం
* 40 లక్షల మందికి డిజిటల్‌ పాఠాలు

 

కరోనా కల్లోలంతో విద్యార్థులంతా బడులకు దూరమైన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం వినూత్నంగా ‘తొలి గంట' కొట్టింది. దేశంలోనే ప్రప్రథమంగా అందరికీ అందుబాటులో ఆన్‌లైన్‌ విద్యాబోధనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనే కాదు.. దేశ, విదేశాల్లో
ఉంటున్న 40 లక్షల మంది విద్యార్థులు రోజూ ఈ-తరగతుల ద్వారా పాఠాలు నేర్చుకుంటున్నారు. నెల రోజుల క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమం అద్వితీయంగా సాగుతోంది.
ప్రభుత్వం పక్కా ప్రణాళికతో చేపట్టిన పనికి ప్రజలు సామాజిక బాధ్యతతో చేయూతనిస్తే అది ఎంత విజయవంతమవుతుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. కొవిడ్‌ కారణంగా విద్యార్థులంతా తరగతులకు హాజరయ్యే పరిస్థితి ఎప్పటికి సాధ్యమో తెలియడం లేదు. కేరళ ప్రభుత్వం దీనికో తాత్కాలిక పరిష్కారాన్ని కనుగొంది. అదే అందరికీ ఆన్‌లైన్‌ విద్యాబోధన. రాష్ట్ర విద్యాశాఖ గట్టి పట్టుదలతో దీన్ని సాకారం చేస్తోంది. జూన్‌ 1న ‘ఫస్ట్‌ బెల్‌' పేరిట ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలల విద్యార్థులంతా ప్రయోజనం పొందేలా ఈ తరగతులు సాగుతున్నాయి.


ఈ-తరగతులిలా..
* 1 నుంచి 12 తరగతుల విద్యార్థులంతా ఇళ్లవద్దే టీవీ, యూట్యూబ్‌ ఛానెళ్లు, ఆన్‌లైన్‌ పోర్టళ్ల ద్వారా వీటికి హాజరు కావచ్చు.
* ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తరగతులుంటాయి. ఆ తర్వాత పునఃప్రసారాలు కూడా ఉంటాయి.
* కేరళ ప్రభుత్వ ఛానెల్‌ ‘కైట్‌ విక్టర్స్‌' ద్వారా ప్రతిరోజూ ఈ పాఠాలను ప్రసారం చేస్తున్నారు. అవే పాఠాలు ఇదే పోర్టల్‌, యూట్యూబ్‌ ఛానెల్‌లోనూ అందుబాటులో ఉంచుతారు.
* పాఠాలను సంబంధిత తరగుతుల ఉపాధ్యాయులే బోధిస్తుండగా.. వాటిని రికార్డు చేసి ప్రసారం చేస్తారు. ఏ వారంలో ఏం బోధిస్తారో టైంటేబుల్‌ను ముందే తెలియజేస్తారు.
పక్కా పర్యవేక్షణ
* ఆన్‌లైన్‌ తరగతులను తొలివారం ప్రయోగాత్మకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంకేతిక సమస్యలు, కేబుల్‌, విద్యుత్తు అంతరాయాలు వంటివాటిని గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టారు.
* ఉపాధ్యాయులే బాధ్యత తీసుకున్నారు. విద్యార్థులంతా ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యేలా పర్యవేక్షిస్తున్నారు. వారికి పాఠాలు ఎంతమేర అర్థమవుతున్నాయో పరిశీలిస్తున్నారు.
సామాజిక విజయం
పిల్లలందరికీ చదువులను చేరవేసే సామాజిక బాధ్యతలో ఎంతోమంది పాలుపంచుకున్నారు. విద్యాశాఖ నిర్వహించిన ఓ సర్వేలో 2 లక్షల మంది విద్యార్థులు తగిన సౌకర్యాలు లేక ఈ-చదువులకు దూరంగా ఉన్నట్లు తేలింది. దీంతో ఇళ్లవద్ద ఇంటర్నెట్‌, కేబుల్‌ టీవీ సౌకర్యం లేనివారికి ఉపాధ్యాయుల నేతృత్వంలో పాఠశాలల ద్వారా ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్మార్ట్‌ఫోన్లు వంటివి అందజేసేందుకు చర్యలు చేపట్టారు. చాలామేర స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు, పంచాయతీలు, రాజకీయ సంస్థల ప్రతినిధులు; పూర్వవిద్యార్థులు, వ్యాపారవేత్తలు తదితరులు సాయానికి ముందుకొచ్చారు.


10 లక్షల సబ్‌స్క్రైబర్లు
ఈ ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించిన తర్వాత కైట్‌ విక్టర్స్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 50,000 నుంచి ఏకంగా 10 లక్షలకు పెరిగింది. అలాగే ప్రత్యేక యూట్యూబ్‌, టీవీ ఛానెళ్లు - లోకల్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ ద్వారా కేరళ బడులకు చెందిన కన్నడ, తమిళ మాధ్యమ విద్యార్థులకు కూడా పాఠాలను ప్రసారం చేస్తున్నాయి. విద్యార్థులు బడులకు వెళ్లి తరగతులు నేర్చుకోవడానికి ఇది ప్రత్యామ్నాయం కానప్పటికీ.. ప్రస్తుతానికి ‘ఫస్ట్‌ బెల్‌'తో ఆన్‌లైన్‌ తరగతులపై ఉన్న సందిగ్ధత, ఆందోళన తొలగినట్లేనని నిపుణులు భావిస్తున్నారు. దీని విజయంతో రాష్ట్రంలోని సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పాఠశాలలూ ఇదే రీతిలో తరగతులను ప్రారంభించాయి.