• facebook
  • whatsapp
  • telegram

అక్టోబర్‌ 15 నుంచి సాంకేతిక కళాశాలల్లో తరగతులు

* ప్రవేశాలకు చివరి తేదీ అక్టోబర్‌ 20
* సవరించిన విద్యా క్యాలెండర్‌ను జారీ చేసిన ఏఐసీటీఈ


ఈనాడు - దిల్లీ: కరోనా నేపథ్యంలో సాంకేతిక కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియను ఏఐసీటీఈ పొడిగించింది. ఈ మేరకు సవరించిన విద్యా (అకడమిక్‌) క్యాలెండర్‌ను జులై 8న విడుదల చేసింది. దీని ప్రకారం ఇంజనీరింగ్‌తోపాటు, ఇతర సాంకేతిక కోర్సుల్లో చేరే విద్యార్థులకు అక్టోబర్‌ 15 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఏఐసీటీఈ ఆమోదంతో నడిచే వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు తొలి రౌండ్‌ కౌన్సిలింగ్‌ అక్టోబర్‌ 5 నాటికి, రెండోరౌండ్‌ కౌన్సిలింగ్‌ను అక్టోబర్‌ 15 లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి అక్టోబర్‌ 20 వరకు గడువు ఉంటుంది. కొత్తగా చేరిన విద్యార్థులతోపాటు, రెండో సంవత్సరంలో ‘లేటరల్‌ ఎంట్రీ’ అయిన వారికి అక్టోబర్‌ 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఇప్పటికే వివిధ సాంకేతిక కోర్సుల్లో ఉన్న విద్యార్థులకు ఆగస్టు 17 నుంచి తరగతులు ప్రారంభించాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. కొత్త క్యాలెండర్‌ ప్రకారం యూనివర్సిటీలు, బోర్డులకు గుర్తింపు మంజూరు చేసేందుకు ఉన్న గడువును ఆగస్టు 15 వరకు పొడిగించింది.
ఇప్పటికే పీజీడీఎం, పీజీసీఎం చదువుతున్న విద్యార్థులకు జులై 15 నుంచి తరగతులు ప్రారంభించాలని తెలిపింది. పీజీడీఎం, పీజీసీఎం సీట్లు రద్దు చేసుకొని పూర్తి మొత్తం రీఫండ్‌ పొందడానికి ఆగస్టు 10 వరకు గడువు విధించింది. ఈ కోర్సుల ప్రవేశాల ప్రక్రియను ఆగస్టు 17 కల్లా పూర్తి చేయాలని నిర్దేశించింది. యూజీసీ నిబంధనలను అనుసరించి తరగతులను ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌తోపాటు, ఆ రెండింటి మిశ్రమ పద్ధతిలో నిర్వహించాలని సూచించింది. ఏఐసీటీఈ క్యాలెండర్‌ ప్రకారం ఇప్పటికే ఎవరైనా తరగతులు ప్రారంభించి ఉంటే వాటిని వాయిదా వేసుకోవాలని పేర్కొంది. లేదంటే గ్రాడ్యుయేషన్‌, డిప్లొమా కోర్సుల చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే వారికోసం ప్రత్యేక తరగతులు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ సవరించిన క్యాలెండర్‌ 2020-21 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.