• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ డిగ్రీ, పీజీ పరీక్షలపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో జులై 9న‌ విచారణ జరిగింది. పరీక్షలను రద్దు చేయాలంటూ ఎస్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించి తీరుతామని హైకోర్టుకు తెలిపారు. పరీక్షల రద్దు కుదరదని పేర్కొన్నారు. పరీక్షల తేదీలను రెండు, మూడు వారాల తర్వాత ఖారారు చేస్తామని చెప్పారు.
అయితే, ఇంటర్నల్‌ మార్కుల ద్వారా గ్రేడింగ్‌ ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది దామోదర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. యూజీసీ మార్గదర్శకాలు కేవలం సూచనలు మాత్రమేనని, ఏడెనిమిది రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. మూడు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.