• facebook
  • whatsapp
  • telegram

ద్వితీయ ఇంటర్‌లో తప్పిన వారంతా ఉత్తీర్ణులే

* అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రద్దు
* 1.47 లక్షల మందికి ఊరట
* విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి


ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ద్వితీయ ఇంటర్‌లో తప్పిన విద్యార్థులందరినీ పాస్‌ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా తీవ్రత దృష్ట్యా సప్లిమెంటరీ పరీక్షల రద్దుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని జులై 9న‌ ఆమె తెలిపారు. గత మార్చిలో జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో తప్పిన విద్యార్థులందరినీ ఉత్తీర్ణుల్ని చేస్తామని, దీనివల్ల మొత్తం 1.47 లక్షలమంది ప్రయోజనం పొందుతారని చెప్పారు. వారంతా కంపార్ట్‌మెంటల్‌లో ఉత్తీర్ణులైనట్లుగా మార్కుల జాబితాలో పేర్కొంటామన్నారు. మార్కుల జాబితాలను జులై 31 తర్వాత కళాశాలల్లో పొందవచ్చన్నారు.
ప్రథమ, ద్వితీయ జవాబుపత్రాల పునర్మూల్యాంకనం, పునఃలెక్కింపు ఫలితాలను 10 రోజుల తర్వాత వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. గత మార్చి పరీక్షల్లో రెండో ఏడాది పాసై మొదటి ఏడాదిలో బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులు ఉంటే వారిని కూడా పాస్‌ చేస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. గత మార్చి పరీక్షల్లో రెండో ఏడాదిలో తప్పి.. తాజాగా గ్రేస్‌ మార్కులు కలిపి పాసైనా.. వారికి మొదటి ఏడాదిలో బ్యాక్‌లాగ్‌లు ఉంటే వారినీ ఉత్తీర్ణులను చేస్తామన్నారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో తప్పిన విద్యార్థుల పరిస్థితిపై మాత్రం ప్రభుత్వం ఏ విషయం వెల్లడించకపోవడంతో వారిలో అయోమయం నెలకొంది. దీనిపై జలీల్‌ను వివరణ కోరగా కరోనా తీవ్రత తగ్గాక నిర్వహిస్తామని తెలిపారు. గతంలో సెప్టెంబరు, అక్టోబరులలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే వారని గుర్తుచేశారు