• facebook
  • whatsapp
  • telegram

యూజీసీ మార్గదర్శకాల ప్రకారమే పరీక్షలు

* హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
* పరీక్షలు రద్దు చేయాలని ఆదేశాలివ్వలేం


ఈనాడు, హైదరాబాద్‌: యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా డిగ్రీ పరీక్షల నిర్వహణ చేపడతామంటూ రాష్ట్ర ప్రభుత్వం జులై 9న‌ హైకోర్టుకు నివేదించింది. యూజీసీ నిర్దేశించిన ప్రామాణిక నిర్వహణ పద్ధతి ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని, నిర్వహణ తేదీని ఇంకా ఖరారు చేయలేదని తెలిపింది. పరీక్షలను రద్దు చేయాలా వద్దా అన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని, అలాంటి ఆదేశాలను తాము ఇవ్వలేమంటూ హైకోర్టు పిటిషనర్ల అభ్యర్థనను తిరస్కరించింది. కరోనా తీవ్రమవుతున్న నేపథ్యంలో యూజీ, పీజీ, ఎంసెట్‌ సహా అన్ని ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలని ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు బి.వెంకట్‌ నర్సింగ్‌రావు, ‘గరీబ్‌ గైడ్‌' స్వచ్ఛంద సంస్థ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ యూజీ, పీజీ పరీక్షలను రద్దు చేయకూడదని, పరీక్షల నిర్వహణకు సంబంధించి యూజీసీ జులై 8న‌ మార్గదర్శకాలు జారీ చేసిందని చెప్పారు. వీటికి అనుగుణంగా పరీక్షలు నిర్వహణ చేపడతామన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది దామోదర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ కరోనా తీవ్రంగా ఉందని, విద్యార్థులకు ప్రమాదకరమని, పరీక్షలను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. అంతర్గత మార్కుల ఆధారంగా ఫైనలియర్‌ విద్యార్థులను పాస్‌ చేయడానికి పంజాబ్‌, హరియాణా, పుదుచ్చేరి, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయని, ఇక్కడా అదే పద్ధతిని అనుసరించవచ్చని సూచించారు. దీనికి ధర్మాసనం నిరాకరిస్తూ పరీక్షలు రద్దు చేయాలన్న విధాన నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వంపై కోర్టు ఒత్తిడి తీసుకురాజలదని స్పష్టం చేసింది. ఒకవేళ పరిస్థితి మరింత విషమించినట్లయితే పరీక్షలు నిర్వహించకూడదని ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవచ్చని వ్యాఖ్యానించింది. ఆలోగా పరిస్థితులు మెరుగుపడటానికి అవకాశాలుండవచ్చని, వేచిచూడాలని పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.