• facebook
  • whatsapp
  • telegram

బోధనతో పాటు వర్క్‌షీట్ల ద్వారా చదువు

* పాఠశాల విద్యార్థులకు కొత్త విద్యా విధానం
ఈనాడు, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం తరగతి గదిలో గంటలపాటు పాఠాలు బోధించే పరిస్థితి ఉండకపోవచ్చు. కొద్ది నెలలపాటు ఒక రోజు బడికి వెళ్లడం...మరో రోజు ఇంటికే పరిమితం కావడం జరగొచ్చు. లేదా ఒక పూటే పాఠశాల ఉండొచ్చు. ఈ పరిస్థితుల్లో పిల్లలు చదువులో వెనకబడకూడదంటే ఉపాధ్యాయులు బోధించే శైలి...పిల్లలు చదువుకునే పాఠాలను అర్థం చేసుకునే విధానం మారాలి. ఈ ఆలోచనతోనే పాఠశాల విద్యాశాఖ ఈసారి కృత్య పత్రాల (వర్క్‌షీట్లు)పై దృష్టి సారించింది. ఒకటి నుంచి పదో తరగతి పాఠశాల విద్యార్థులకు వాటిని అందించాలని భావిస్తున్నారు. విషయ నిపుణులతో పాఠాల వారీగా తయారు చేయించే పనిలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ఉంది. రెండు స్థాయుల్లో వాటిని రూపొందిస్తున్నారు. ఒక విద్యార్థి గతంలో చదివిన వాటిని గుర్తు చేసుకునేందుకు ఒక రకమైన వర్క్‌షీట్లు, ప్రస్తుతం చదువుతున్న తరగతిలో పాఠ్యాంశాలపై మరో స్థాయి కృత్య పత్రాలను తయారు చేస్తున్నారు. ఆ ప్రక్రియ దాదాపు పూర్తికావొచ్చింది. ఈ విధానం అమలు చేయడంతోపాటు వాటిని విద్యార్థులకు అందించేందుకు అనుమతి కోసం అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. కొద్దిరోజుల్లో అనుమతి రావొచ్చని తెలిసింది. కృత్య పత్రాల విధానాన్ని ఎప్పటి నుంచో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలు సిలబస్‌లో భాగంగా అమలు చేస్తున్నాయి.


ఏమిటీ కృత్య పత్రాలు?
పాఠం బోధించిన తర్వాత పిల్లలకు హోంవర్క్‌ ఇవ్వడం ఎప్పటినుంచో ఉన్న విధానమే. అవి సాధారణంగా పాఠంలోని అంశాలపై ప్రశ్నలు-జవాబుల రూపంలో ఉంటాయి. కృత్య పత్రాలు మాత్రం కొంత భిన్నం. విద్యార్థి సృజనాత్మకత, తర్కం, విశ్లేషణ తదితర సామర్థా్యలను పరిశీలించేలా...పాఠ్యాంశాలను అన్ని కోణాల్లో అర్థం చేసుకునేలా ఉంటాయి. కొంతవరకు సొంతంగా నేర్చుకునేందుకు దోహదపడతాయి. ఉపాధ్యాయులు బోధిస్తే విద్యార్థులు సాధన ద్వారా సంపూర్ణంగా పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఒక పాఠాన్ని ఎంత వరకు నేర్చుకున్నాడో అంచనా వేయడానికి దీని ద్వారా వీలవుతుంది. ‘సీబీఎస్‌ఈలో కేవలం కృత్య పత్రాలు విద్యార్థిని అంచనా వేయడానికే ఉంటాయని... ఇక్కడ కొంత భిన్నంగా వివరణ కూడా రాస్తున్నాం' అని కృత్య పత్రాలను తయారు చేస్తున్న విషయ నిపుణుడు ఒకరు తెలిపారు. ఒక పాఠంలో ఎన్ని భావనలు (కాన్సెప్టులు) ఉంటే అన్ని వర్క్‌షీట్లను తయారు చేస్తున్నామని చెప్పారు.