• facebook
  • whatsapp
  • telegram

విద్యార్థి వీసాలపై వెనక్కి

* యథాతథస్థితిని పాటిస్తామని కోర్టుకు ట్రంప్‌ సర్కారు వెల్లడి
వాషింగ్టన్‌: విదేశీ విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానాన్ని ఎంచుకుంటే అమెరికాలోకి రానీయకుండా వీసాల పరంగా ఆంక్షలు విధిస్తామన్న నిర్ణయం నుంచి అగ్రరాజ్యం అనూహ్యంగా వెనక్కి తగ్గింది. వీసా ఆంక్షలపై విమర్శలు వెల్లువెత్తడంతోపాటు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నేతృత్వంలో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ సహా అనేక అగ్రశ్రేణి సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యథాతథ స్థితిని పాటిస్తామని డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు బుధవారం న్యాయస్థానానికి తెలిపింది. సెప్టెంబరు-డిసెంబరు (ఫాల్‌) సెమిస్టర్‌లో కేవలం ఆన్‌లైన్‌ తరగతులనే నిర్వహించాలని అమెరికా విశ్వవిద్యాలయాలు నిర్ణయించుకుంటే వాటి విద్యార్థులు అమెరికా విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుందని ఈ నెల 6న వలసల విభాగం ప్రకటించింది.
దీనిని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై బోస్టన్‌లోని ఫెడరల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి అలిసన్‌ బరోస్‌ విచారణ ప్రారంభిస్తూ.. ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు అందిన సమాచారాన్ని వెల్లడించారు. విద్యార్థి వీసాలపై యథాతథ పరిస్థితి దేశమంతటికీ వర్తిస్తుందని స్పష్టంచేశారు. ఇది విదేశీ విద్యార్థులకు ఎంతో ఊరటనివ్వనుంది. విదేశీ విద్యార్థులకు వీసాలు ఉపసంహరించుకుంటామనే నిబంధనపై భారత్‌ ఇదివరకే అభ్యంతరం వెలిబుచ్చింది. నిర్ణయం నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గడం విద్యార్థుల విజయమని పలువురు సెనేటర్లు వ్యాఖ్యానించారు.
త్వరలో ప్రతిభ ఆధారిత వలసల చట్టం: ప్రతిభపై ఆధారపడి వలసలు ఉండేలా బలమైన చట్టంపై త్వరలోనే సంతకం చేయనున్నట్లు ట్రంప్‌ పునరుద్ఘాటించారు. తగిన పత్రాలు లేని తల్లిదండ్రుల పిల్లలుగా అక్రమంగా వలస వచ్చినవారినీ ఇది రక్షిస్తుందన్నారు. ఇలాంటివారిలో ఎక్కువ మంది భారత్‌కు, లేదా దక్షిణాసియా దేశాలకు చెందినవారే ఉన్నారు.