• facebook
  • whatsapp
  • telegram

సైన్స్‌ సబ్జెక్టులో తక్కువ మార్కులపై విచారణ జరపండి

ఈనాడు, హైదరాబాద్‌: సీబీఎస్‌ఈ పదో తరగతిలోని సైన్స్‌ సబ్జెక్టులో అధిక శాతం విద్యార్థులు తక్కువ మార్కులు సాధించారని, దీనిపై నిపుణుల కమిటీని నియమించి విచారణ జరపాలని సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ స్టడీస్‌ అండ్‌ సర్వీస్‌(సెస్‌) ఛైర్మన్‌ నాగటి నారాయణ.. సీబీఎస్‌ఈ ఛైర్మన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన జులై 16న‌ లేఖ రాశారు. గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ఒక్క సబ్జెక్టులో మార్కులు తగ్గాయని,  ఈ ఏడాది సైతం మిగతా సబ్జెక్టులతో పోల్చుకుంటే సైన్స్‌లో 10 శాతం తక్కువ వచ్చాయని, దానివల్ల 11వ తరగతిలో సీట్లు దక్కవని ఆయన పేర్కొన్నారు. దీనిపై సెస్‌ ఆరా తీయగా సైన్స్‌ సబ్జెక్టులో జీవ, భౌతిక, రసాయనశాస్త్రాలు ఉండటం వల్ల గతంలో ముగ్గురు దిద్దేవారని, ఈసారి జవాబుపత్రాలను  ఇళ్లకు పంపడం, ఒక ఉపాధ్యాయుడే దిద్దటం వల్ల ఆయన బోధించని విభాగాలపై అవగాహన లేక తక్కువ మార్కులు వేశారని తేలిందన్నారు. దీనిపై కమిటీ వేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.