• facebook
  • whatsapp
  • telegram

సెప్టెంబరులోనే ప్రవేశాలు.. పరీక్షలు!

* విద్యా సంవత్సరం రెండున్నర నెలలు వెనక్కి
ఈనాడు, అమరావతి: కరోనా కారణంగా ఈ ఏడాది ప్రవేశాలు, పరీక్షలు మొత్తం సెప్టెంబరులోనే జరగనున్నాయి. విద్యా సంవత్సరం క్యాలండర్‌ పూర్తిగా మారింది. మార్చి, ఏప్రిల్‌లో పూర్తి కావాల్సిన సాధారణ పరీక్షలు.. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు, జూన్‌లో ప్రారంభమయ్యే విద్యాసంస్థల ప్రక్రియ అంతా సెప్టెంబరుకు చేరింది. మొదట ఆగస్టు 3న బడులు తెరవాలని నిర్ణయించారు. కరోనా ఉద్ధృతి పెరగడంతో ఇది వాయిదా పడింది. విద్యాశాఖ కార్యకలాపాలన్నీ దాదాపు రెండున్నర నెలలు వెనక్కి వెళ్లాయి. అప్పటికీ వైరస్‌ వ్యాప్తి తగ్గితేనే విద్యార్థుల హడావుడి కనిపిస్తుంది.
* విద్యా సంస్థలను సెప్టెంబరు 5 నుంచి పున:ప్రారంభించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖకు పాఠశాల విద్యాశాఖ సమాచారం అందించింది.
* అండర్‌ గ్రాడ్యుయేషన్‌, పోస్టుగ్రాడ్యుయేషన్‌ చివరి సెమిస్టర్‌ పరీక్షలను సెప్టెంబరు 30లోపు నిర్వహించాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) సూచించింది. దీంతో విశ్వవిద్యాలయాలన్నీ అదే నెలలో పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి.
* ఎంసెట్‌, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలను సెప్టెంబరు మూడో వారానికి వాయిదా వేశారు. నీట్‌ అనంతరం ఎంసెట్‌ నిర్వహించనున్నారు.
పుస్తకాల సరఫరాలోనూ..
సాధారణంగా జూన్‌ 12లోపే పుస్తకాలు విద్యార్థులకు అందాలి. కరోనా కారణంగా ఈసారి పుస్తకాల ముద్రణ, సరఫరాలో జాప్యమేర్పడింది. 1-6 తరగతుల వరకు పుస్తకాలను మార్పు చేశారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమం రెండు పాఠ్యాంశాలను కలిపి ఒకే పుస్తకంగా ముద్రిస్తున్నారు. మొదటి విడత పుస్తకాల ముద్రణ కొనసాగుతోంది. 7 నుంచి 10 తరగతుల వరకు పాత పుస్తకాలనే ముద్రించి జిల్లాలకు సరఫరా చేశారు.