• facebook
  • whatsapp
  • telegram

సాధారణ స్థితి వరకు ఆన్‌లైన్‌ బోధన చాలు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా పరిస్థితిని బట్టి పాఠశాలలు ఎప్పుడు ప్రారంభించాలో ప్రభుత్వాలు నిర్ణయించాలి తప్ప తల్లిదండ్రులు కాదని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం(టీపీఏ) తెలిపింది. పాఠశాలలు ఎప్పుడు ప్రారంభించమంటారో చెప్పండని కేంద్ర మానవ వనరుల శాఖ తల్లిదండ్రుల అభిప్రాయాలను కోరిన నేపథ్యంలో టీపీఏ స్పందించింది. గత మార్చిలో పాఠశాలలను మూసివేసినప్పుడు ఎందుకు అడగలేదని ప్రశ్నించింది. కొంత మంది తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకుంటే కొందరు ఆగస్టు, మరికొందరు సెప్టెంబరు అని చెప్పారని.. ఎప్పుడు తెరిచినా పిల్లల ఆరోగ్యానికి  ముప్పు లేకుండా చూడాలని వారు హెచ్చరించారని సంఘం తెలిపింది. పరిస్థితి చక్కబడే వరకు ఆగడం మంచిదని, అప్పటి వరకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తే చాలని తల్లిదండ్రులతో పాటు టీపీఏ కూడా కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తోందని సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ తెలిపారు.
కేంద్రానికి యూటీఎఫ్‌ నివేదిక: ఆన్‌లైన్‌ తరగతులకు ట్యాబ్‌లు, నెట్‌ సమస్య ఉందని పలువురు విద్యార్థులు,తల్లిదండ్రులు తమ సర్వేలో చెప్పారని పేర్కొంటూ టీఎస్‌యూటీఎఫ్‌ కేంద్రానికి నివేదిక పంపింది. ఈ విషయాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి ఒక ప్రకటనలో వివరించారు.
గడువు పెంచండి: తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించాలని జులై 17న రాష్ట్ర ప్రభుత్వాలకు  ఆదేశాలు పంపి 20వ తేదీ తుది గడువు ఇస్తే ఎలా సాధ్యమవుతుందని ట్రస్మా  ఒక ప్రకటనలో కేంద్రాన్ని ప్రశ్నించింది. గడువు పెంచాలని, అందిన అభిప్రాయాలను, పంపిన వారి జాబితాను కూడా పారదర్శకంగా వెల్లడించాలని కోరింది.