• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ తెలుగు పాఠ్య ప్రణాళికలో మార్పు

* తెలంగాణ రచనలకు మరింత ప్రాధాన్యం
 

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు పాఠ్య ప్రణాళికను ఇంటర్‌ బోర్డు మార్చబోతోంది. ఇప్పటికే నిపుణుల కమిటీని నియమించి పాఠ్యాంశాల రూపకల్పనలో నిమగ్నమైంది. ఈసారి పాఠ్య పుస్తకం మరింత తెలంగాణీకరణ కానుందని బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ విద్యా సంవత్సరం (2020-21)లోనే ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. 2021-22 విద్యా సంవత్సరానికి ద్వితీయ సంవత్సరంలోనూ కొత్త పాఠ్య ప్రణాళికతో పుస్తకాలు రూపొందుతాయి. ‘ఈసారి మరింత మంది తెలంగాణ రచయితలకు చెందిన అంశాలు ఉండేలా పుస్తకాలు తీర్చిదిద్దుతున్నాం. పాఠ్య ప్రణాళిక సిద్ధమైన తర్వాత రాష్ట్ర సలహాదారు రమణాచారి తదితరుల ఆమోదం తీసుకుంటాం’ అని ఇంటర్‌బోర్డు వర్గాలు తెలిపాయి.
సరళతరంగా చేస్తేనే...
ఏటా ఇంటర్‌లో సుమారు 5 లక్షల మంది ప్రవేశాలు పొందుతున్నారు. వారిలో ద్వితీయ భాషగా తెలుగును ఎంచుకునే వారు లక్షకు మించడం లేదు. మార్కులు అధికంగా వస్తాయనే కారణంతో సంస్కృతాన్ని ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పాఠ్యాంశాలను మరింత సరళతరం చేయాలన్న అభిప్రాయాన్ని కొందరు తెలుగు అధ్యాపకులు వ్యక్తంచేస్తున్నారు. ప్రాచీన కవిత్వాన్ని కొంతమేర తగ్గించి, సమకాలీన రచయితల రచనలను చేరిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.