• facebook
  • whatsapp
  • telegram

పీజీ మెడికల్‌, డెంటల్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

* విడుదల చేసిన కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం
 

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రైవేటు పీజీ మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లో ప్రవేశాలకు తుది కౌన్సెలింగ్‌(మాపాప్‌) నోటిఫికేషన్‌ను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జులై 26న‌ విడుదల చేసింది. మిగిలిపోయిన యాజమాన్య కోటా సీట్ల భర్తీకి జులై 28న వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అదే రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాధాన్య క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించారు. యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని వారు పేర్కొన్నారు. గత విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్‌ అయి కళాశాలల్లో చేరని అభ్యర్థులు, కళాశాలల్లో చేరి తరగతులకు హాజరుకాని అభ్యర్థులను ఈ విడత వెబ్‌ కౌన్సెలింగ్‌కు అనర్హులుగా పరిగణిస్తామన్నారు. అఖిల భారత కోటా కౌన్సెలింగ్‌ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులు కూడా అనర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.