• facebook
  • whatsapp
  • telegram

ప్రమోట్‌ చేసినా.. పరీక్ష రాయాల్సిందే!

* చివరి ఏడాది మినహా మిగిలిన వాటిపై వర్సిటీల ప్రతిపాదన
 

ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీ, ఇంజినీరింగ్‌ సహా అన్ని సంవత్సరాలకు సంబంధించి ఫైనలియర్‌ పరీక్షలను వర్సిటీలు ముందుగా నిర్వహించనున్నాయి. ఇదే సమయంలో మిగిలిన సంవత్సరాలకు సంబంధించిన పరీక్షలు ఉంటాయా? అన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమీక్ష సందర్భంగా చివరి ఏడాది విద్యార్థులు కాకుండా మిగిలిన సంవత్సరాల వారిని పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎలాంటి పరీక్షలు లేకుండా కోర్సుల వారీగా విద్యార్థులంతా ప్రమోట్‌ అవుతారు. కానీ వీరంతా తర్వాత పరీక్షలు రాయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఉస్మానియా, జేఎన్‌టీయూ తరఫున పరీక్షల విషయంలో రెండు రకాల ఆప్షన్లు నిర్ణయించారు.
* మొదటిది ఫైనలియర్‌ విద్యార్థులకు పరీక్షలు ముగిశాక, మిగిలిన సంవత్సరాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి. కానీ ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో పరీక్షలు లేకుండానే పైతరగతులకు విద్యార్థులు వెళతారు.
* రెండో ఆప్షన్‌ తరగతులు ప్రారంభించిన తర్వాత మధ్యలో పరీక్షలు నిర్వహించడం. ప్రస్తుతం ఈ విధానంపై కసరత్తు చేస్తున్నారు. ఉన్నత విద్యా మండలి తుది ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటారు.
* వచ్చే నెలలో ఆన్‌లైన్‌లో తరగతులు ప్రారంభించేందుకు వర్సిటీలు సిద్ధమవుతున్నాయి.  పరిస్థితి చక్కబడిన తరువాత తరగతి గది బోధన ప్రారంభమవుతుంది. ఆ తర్వాతే మిగిలిన సంవత్సరాల విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి.
* ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు మినహా, మిగిలిన సంవత్సరాల విద్యార్థులు పైతరగతులకు ప్రమోట్‌ అవుతారు. కానీ తర్వాత సెమిస్టర్‌ ప్రారంభించాక అంతకుముందు ఏడాదికి సంబంధించిన పరీక్షలు రాయాల్సి ఉంటుంది. నవంబరు లేదా డిసెంబరులో వాటిని నిర్వహించే వీలుంది. - జేఎన్‌టీయూ, ఉస్మానియా వర్సిటీల అధికారులు

 

 క్రెడిట్‌ డిటెన్షన్‌ ఉండదు!
విద్యార్థులు పరీక్షలు లేకుండా నేరుగా పైతరగతులకు ప్రమోట్‌ అవుతున్నారు కాబట్టి ఈసారికి వర్సిటీల పరిధిలో క్రెడిట్‌ డిటెన్షన్‌ ఉండదు. జేఎన్‌టీయూ, ఉస్మానియా పరిధిలో అన్ని సంవత్సరాల వారికి దీన్ని వర్తింపజేయనున్నారు. దీనివల్ల విద్యార్థులకు ఎంతో ఊరట లభించనుంది. తర్వాత నిర్వహించే పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణులు కాకపోయినా ప్రభావం ఉండదు. అదే తరగతిలో కొనసాగుతారు. కాకపోతే బ్యాక్‌లాగ్స్‌ను కోర్సు అయ్యేలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.