• facebook
  • whatsapp
  • telegram

వైద్యవిద్యార్థులకు అందని ఉపకారవేతనాలు

ఈనాడు డిజిటల్‌- అమరావతి: కొవిడ్‌-19 విధుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వైద్య విద్యార్థులకు ఉపకార వేతనాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్రంలోని హౌస్‌ సర్జన్లకు నాలుగు నెలలుగా, ప్రభుత్వ వైద్య విద్య కళాశాలల్లోని పీజీ విద్యార్థులకు మే నెల నుంచి ఉపకారవేతనాలు అందడం లేదు. రాష్ట్రంలో హౌస్‌ సర్జన్లు, పీజీ వైద్య విద్యార్థులు కలిపి మొత్తం 8 వేల మంది ఉన్నారు. హౌస్‌ సర్జన్లకు నెలకు రూ.15 వేల చొప్పున ప్రభుత్వం ఉపకారవేతనంగా చెల్లిస్తోంది. ఈ ఉపకార వేతనం మార్చి నుంచి అందడం లేదు. పీజీ వైద్య విద్యార్థులకు తొలి సంవత్సరం రూ.35,500, రెండో సంవత్సరం వారికి రూ.37,500, తృతీయ సంవత్సరం వారికి రూ.39,500 చొప్పున ప్రభుత్వం ఉపకార వేతనం చెల్లిస్తోంది. జులై నెల ముగుస్తున్నా ఇవి అందకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదని జూనియర్‌ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు దీప్‌చంద్‌  తెలిపారు. ఉపకారవేతనాలు ప్రతి రెండోళ్లకోసారి పెంచాల్సి ఉందని, చివరిసారిగా 2018లో మాత్రమే పెంచారని పేర్కొన్నారు.
త్వరలోనే చెల్లింపులు: వైద్యారోగ్య శాఖ
ఉపకార వేతనాల చెల్లింపులో జాప్యాన్ని వైద్యారోగ్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సమస్యను ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. త్వరలోనే చెల్లిస్తారని చెప్పారు.