• facebook
  • whatsapp
  • telegram

పరీక్షలపై పట్టుదల.. విద్యార్థుల ఆందోళన

* నిర్వహించాల్సిందేనన్న యూజీసీ ఆదేశాలపై వివాదం
* ఒకే విధానం వద్దంటున్న విద్యావేత్తలు

ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీ, పీజీ స్థాయి కోర్సుల్లో చివరి సెమిస్టర్‌ పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించాలన్న యూజీసీ ఆదేశాలపై దేశవ్యాప్తంగా వివాదం కొనసాగుతోంది. కరోనా కారణంగా పరీక్షలను రద్దు చేయాలని యూజీసీ మాజీ ఛైర్మన్‌ సుఖదేవ్‌ థొరాట్‌ తదితరులు.. యూజీసీ ఛైర్మన్‌కు లేఖలు రాశారు. దిల్లీలో కొందరు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పరీక్షలను రద్దు చేయాలని తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయి. వెరసి.. ఈ పరీక్షల వ్యవహారం వేడి పుట్టిస్తూ విద్యార్థులను ఆందోళనకు లోనుచేస్తోంది. ఈ నేపథ్యంలో.. దీనిపై కొందరు విద్యావేత్తలతో ‘ఈనాడు’ మాట్లాడగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
* ‘చివరి సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించకుంటే విశ్వసనీయత ఉండదు. ప్రపంచ మార్కెట్లో చులకనగా మారతాం. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలు సైతం ఏదో ఒక విధంగా పరీక్షలు జరుపుతున్నాయి’.
                          - యూజీసీ చెబుతున్న మాట
* ‘కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చివరి సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించకుంటే వచ్చే నష్టమేమీ లేదు. గత సెమిస్టర్‌ మార్కుల ఆధారంగా ఫలితాలు ఇవ్వొచ్చు’.
                        - కొందరు విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల వాదన

 ఒకే తరహా విధానం పనికి రాదు.
 పరీక్షలను నిర్వహించాలా? వద్దా? అన్నది విశ్వవిద్యాలయాలకే వదిలేయాలి. కరోనా వ్యాప్తికి సంబంధించి ఒక్కో చోట ఒక్కోరకమైన పరిస్థితులు ఉన్నందున దేశవ్యాప్తంగా ఒకే విధానం మంచిది కాదు. యూజీసీ లేదా కేంద్ర ప్రభుత్వం పరీక్షలపై ప్రతిష్ఠకు పోరాదు. తక్కువ సంఖ్యలో ఉన్న కోర్సులకు పరీక్షలు నిర్వహించవచ్చు.
                                                    - ఆచార్య వీఎస్‌ ప్రసాద్‌, మాజీ ఛైర్మన్‌, న్యాక్‌

ఏదో ఒక పరీక్ష అవసరమే
విద్యార్థుల ప్రతిభ గుర్తించేందుకు పరీక్షలే కొలమానం. పరీక్ష లేకుండా అందరినీ ఒకే గాటన కడితే ప్రతిభావంతులు నష్టపోతారు. పరీక్షను గంట, గంటన్నరలో ముగించాలి. అంతకు ముందు సంవత్సరాల మార్కులకు కొంత వెయిటేజీ ఇచ్చి గ్రేడ్లు కేటాయించవచ్చు. డిగ్రీ, పీజీల్లో తక్కువ విద్యార్థులు ఉన్నందున షిఫ్టుల వారీగా జరుపుకోవచ్చు.
                        - ఆచార్య ముత్యాలనాయుడు, మాజీ వీసీ, నన్నయ వర్సిటీ

ముఖాముఖి ప్రధానం
పీజీలో చివరి సెమిస్టర్‌కు అంతర్గత పరీక్షలు, ప్రాజెక్టులు పూర్తయ్యాయి.5 శాతానికే పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని రద్దుచేశాం. ఎన్ని మార్కులు వచ్చినా.. ముఖాముఖిలో ప్రతిభ చూపనిదే విద్యార్థులను ఎవరూ ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదు.
                        - ఆచార్య పొదిలె అప్పారావు, ఉపకులపతి, హెచ్‌సీయూ