• facebook
  • whatsapp
  • telegram

ఆంగ్ల మాధ్యమం అమలుకు కట్టుబడి ఉన్నాం

* మాతృభాష తప్పనిసరని నూతన విద్యా విధానంలో చెప్పలేదు
* 6 వరకు ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో పుస్తకాలు ప్రచురించాం
* విద్యాశాఖ మంత్రి సురేష్‌ వెల్లడి

 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమ విద్య అమలుకు కట్టుబడి ఉన్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. తెలుగును ఒక పాఠ్యాంశంగా తప్పనిసరిగా అమలు చేస్తామని తెలిపారు. తెలుగు మాధ్యమ పాఠశాలలనూ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉన్నత విద్యలో ఉపాధ్యాయ శిక్షణలో అడ్వాన్సు కోర్సులు అందించేందుకు ప్రకాశం జిల్లాలో టంగుటూరి ప్రకాశం డిజిటల్‌ విశ్వవిద్యాలయ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం విడుదల చేసిన జాతీయ విద్యా విధాన ముసాయిదాపత్రంలోని అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించామన్నారు. ‘అవకాశం ఉన్నంత వరకు మాతృభాష లేదా స్వదేశీ, స్థానిక భాషల్లో  విద్యాబోధన చేయాలని ముసాయిదా పత్రంలో పేర్కొన్నారు. మాతృభాషలో బోధిస్తే పిల్లలు సులువుగా తొందరగా నేర్చుకుంటారని ఉంది. అంతేగానీ తప్పనిసరి అని చెప్పలేదు’ అని వివరించారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు తెలుగు, ఆంగ్లమాధ్యమంలో పాఠ్యపుస్తకాలను ఇప్పటికే ప్రచురించామని మంత్రి వెల్లడించారు. ద్విభాషా పాఠ్యపుస్తకాలను ప్రచురించాలని ముసాయిదా పత్రంలో ఉందని వివరించారు. దేశంలోనే ఆదర్శవంతమైన విద్యావ్యవస్థను ఆంధ్రప్రదేశ్‌లో తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆగస్టు చివరి నాటికి కరోనా ప్రభావం తగ్గుతుందని అంచనా వేస్తున్నామని సురేష్‌ వివరించారు. సెప్టెంబరు 5న పాఠశాలల్ని తెరవాలని సీఎం ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించారన్నారు. పాఠశాలలు తెరిచే ముందు మరోసారి పరిస్థితి సమీక్షిస్తామని చెప్పారు.
సుప్రీంకోర్టులో కేసు కొనసాగిస్తాం
ఆంగ్ల మాధ్యమంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, కేసును కొనసాగిస్తామని మంత్రి సురేష్‌ స్పష్టం చేశారు. ఎస్‌ఈఆర్‌టీ సహా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నివేదికలు తీసుకున్న తర్వాతే ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టాలని నిర్ణయించామన్నారు. ఆంగ్ల మాధ్యమం అమలును అడ్డుకోవద్దని, కేంద్ర నూతన విద్యావిధానాన్ని సాకుగా చూపి దీన్ని వ్యతిరేకించవద్దని కోరుతున్నామని చెప్పారు. ఆంగ్ల మాధ్యమమే కావాలని చంద్రబాబు స్వగ్రామం నుంచీ తల్లిదండ్రుల కమిటీ తీర్మానం చేసిందని తెలిపారు.
ముసాయిదాలో మా సూచనలే
తమ ప్రభుత్వం ఏడాది కిందటే మానవ వనరులశాఖను విద్యాశాఖగా మార్చిందని.. కేంద్రం ఇప్పుడు అదే చేసిందని మంత్రి సురేష్‌ వివరించారు. సీఎం జగన్‌ సహా తామిచ్చిన పలు సూచనల్ని ముసాయిదా పత్రంలో కేంద్రం పొందుపరిచిందని పేర్కొన్నారు. పిల్లలను బడికి పంపించే తల్లిదండ్రులకు ఏటా రూ.15వేలు ఇచ్చేలా అమ్మఒడిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరామన్నారు. ఇండియన్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ పెట్టాలని సూచించామని తెలిపారు. కేంద్ర నూతన విద్యా విధానాన్ని తాము సమర్థిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.