• facebook
  • whatsapp
  • telegram

ప్రైవేటు ఉపాధ్యాయులకూ టెట్‌ తప్పనిసరి!

* గురువుల నియామక ప్రక్రియ మరింత కట్టుదిట్టం
* నూతన జాతీయ విద్యా విధానంలో కఠిన నిబంధనలు

 

ఈనాడు, హైదరాబాద్‌: నాణ్యమైన విద్య విద్యార్థి హక్కు అని జాతీయ నూతన విద్యా విధానంలో స్పష్టంచేసిన కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను మరింత కట్టుదిట్టం చేయనుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)తోపాటు తరగతి గది బోధన లేదా ముఖాముఖి(ఇంటర్వూ)నీ ఇందులో భాగం చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికీ ఆ నిబంధనలను తప్పనిసరి చేసింది. ముఖాముఖిలో భాగంగా స్థానిక భాషలో వారికున్న ప్రావీణ్యాన్నీ పరిశీలిస్తారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని చాలా పాఠశాలల్లో బోధిస్తున్న ఉపాధ్యాయులకు టెట్‌ లేదు. కార్పొరేట్‌ పాఠశాలల్లో బీటెక్‌ అభ్యర్థులూ బోధిస్తున్నారు.
ఈ విధానం అమల్లోకి వస్తే వారందరూ టెట్‌ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. పాఠశాల విద్యలో నాలుగు దశలు ఉన్నందున అన్ని దశల్లో పనిచేసే గురువులకు టెట్‌ను విస్తరిస్తారు. అంటే శిశు తరగతులకు బోధించే వారికీ ఇది తప్పనిసరి కానుంది. భారతీయ సంస్కృతి, కళలు, వృత్తి విద్యను చదువులో భాగం చేస్తామని పేర్కొన్న కేంద్రం ఆయా నిపుణులను ఆయా పాఠశాలలు లేదా స్కూల్‌ కాంప్లెక్స్‌లు నియమించుకునే వెసులుబాటు కల్పించింది. స్థానికంగా ప్రముఖ వ్యక్తులనూ ఇన్‌స్ట్రక్చర్లుగా నియమించుకోవచ్చని తెలిపింది. మారుమూల ప్రాంతాల్లో, ముఖ్యంగా నాణ్యమైన ఉపాధ్యాయుల కొరత త్రీవంగా ఉన్నచోట పనిచేసేందుకు ముందుకు వచ్చే వారికి ప్రోత్సాహకాలు(స్థానికంగా లేదా పాఠశాల ఆవరణలో ఇల్లు సమకూర్చడం లేదా ఇంటి భత్యం పెంచడం వంటివి) ఇస్తారు.
బీఈడీ విద్యార్థులకు ఉపకార వేతనాలు
ప్రతిభావంతులైన విద్యార్థులు, ముఖ్యంగా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ(ఇంటర్‌ తర్వాత డిగ్రీ + ఉపాధ్యాయ విద్య)లో చేరే గ్రామీణ విద్యార్థులకు పెద్ద సంఖ్యలో ఉపకార వేతనాలు ఇస్తారు. అమ్మాయిలకు ప్రాధాన్యమిస్తారు.