• facebook
  • whatsapp
  • telegram

బహుళ కోర్సుల సంస్కృత వర్సిటీలు!

* కొత్త విధానంలో మూస ధోరణి వద్దన్న
* కేంద్ర సర్కారు నిర్ణయమే కారణం

ఈనాడు, హైదరాబాద్‌:  ఒక విశ్వవిద్యాలయంలో ఒకే రకం కోర్సులే ఉండటానికి వీల్లేదు.. బహుళ కోర్సులు ఉండాల్సిందే.. జాతీయ నూతన విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమిది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సంస్కృత విశ్వవిద్యాలయాల్లోనూ రకరకాల ఇతర కోర్సులు రానున్నాయి. అవి కూడా బహుళ కోర్సుల వర్సిటీలుగా మారతాయని కేంద్రం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం(సెంట్రల్‌), శ్రీ వెంకటేశ్వర వేదిక్‌ విశ్వవిద్యాలయం ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా మరో 16 విశ్వవిద్యాలయాలున్నాయి. మొత్తం సంస్కృత వర్సిటీల్లో మూడు కేంద్రీయ, ఒక డీమ్డ్‌, 14 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు మనుగడలో ఉన్నాయి. తిరుపతిలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం పేరిట ఉన్న డీమ్డ్‌ వర్సిటీని గత మార్చిలో కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మార్చారు. మరోవైపు పాఠశాల విద్యలో మూడు భాష(త్రిభాష)ల్లో సంస్కృతాన్ని సైతం ఒక సబ్జెక్టుగా ఎంచుకునేలా కేంద్రం దాన్ని చేర్చింది.
అనువాదానికో ఓ సంస్థ
 పాఠశాల విద్యే కాదు.. ఉన్నత విద్యనూ రెండు భాషల్లో బోధించాలని కేంద్రం భావిస్తోంది. ఉపాధ్యాయులు ఆంగ్లంతో పాటు మాతృభాషలో బోధించాలన్నది లక్ష్యం. అది సాధించాలంటే ఆంగ్లంలో ఉన్న పాఠ్యపుస్తకాలను, సమాచారాన్ని వివిధ భారతీయ భాషల్లోకి తర్జుమా చేయాల్సి ఉంది. అందుకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషన్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌(ఐఐటీఐ) నెలకొల్పుతారు. వివిధ భాషల్లో నిఘంటువులను ముద్రిస్తారు. కొత్త పదాలను ఎప్పటికప్పుడు భారతీయ భాషల్లోకి చేరుస్తారు. జాతీయ విద్యాసంస్థల్లో పాళీ, పర్షియన్‌, ప్రాకృత భాషా విభాగాలనూ ఏర్పాటుచేస్తారు.