• facebook
  • whatsapp
  • telegram

ఇంటి నుంచే సీఎంఏ ఫౌండేషన్‌ పరీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) ఆధ్వర్యంలో నిర్వహించే కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ(సీఎంఏ) ఫౌండేషన్‌ పరీక్షను అభ్యర్థులు ఇళ్ల నుంచే రాయొచ్చు. పరీక్షా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ మేరకు ఐసీఏఐ నిర్ణయం తీసుకుంది. సీఎంఏ కోర్సులో మూడు దశలు ఉండగా అందులో మొదటిది ఫౌండేషన్‌. ఈ పరీక్షను తొలిసారిగా సెప్టెంబరు 6న దేశవ్యాప్తంగా ఇంటి నుంచే (హోం బేస్‌డ్‌) రాసుకునే విధానాన్ని అమలు చేయనున్నారు. గతంలో దీన్ని నాలుగు రోజులపాటు నిర్వహించేవారు. ఈ సారి ఒక్క రోజు మాత్రమే జరుపుతారు. ఉదయం 10 గంటలకు పేపర్‌ - 1, మధ్యాహ్నం 2 గంటలకు పేపర్‌ - 2, 3, 4 ఉంటాయి.
సీఎంఏ  ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షలు ఇక డిసెంబరులోనే
మరోవైపు సీఎంఏలో రెండో దశ అయిన ఇంటర్‌, చివరి దశ అయిన ఫైనల్‌ పరీక్షలు జూన్‌లో జరగాల్సి ఉండగా..  సెప్టెంబరులో నిర్వహిస్తామని గతంలో ప్రకటించిన ఐసీఏఐ తాజాగా ఆ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వాటిని డిసెంబరులో జరిగే పరీక్షల్లో కలిపివేస్తున్నట్లు వెల్లడించింది.