• facebook
  • whatsapp
  • telegram

ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు తెలుగులోనూ పాఠాలు

* మూడో తరగతి ‘పరిసరాల విజ్ఞానం’లో కొత్త విధానం
ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, దేవరుప్పుల: ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో అర్థం అయినట్లుగా ఆంగ్లంలో పాఠాలు అర్థం కావనేది నిపుణులు చెబుతున్నదే. ఈ నేపథ్యంలో ఆంగ్ల మీడియం మూడో తరగతి ‘పరిసరాల విజ్ఞానం’ పాఠ్యపుస్తకంలో పాఠాలను రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రచురించింది. పుస్తకం ప్రతి పేజీలో మొదట తెలుగులో, దిగువన ఆంగ్లంలో ముద్రించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులకు ‘పరిసరాల విజ్ఞానం’ సబ్జెక్టు మూడో తరగతితోనే ప్రారంభమవుతుంది. విద్యార్థులు మొదట తెలుగులో పాఠం చదివి అర్థం చేసుకుని తర్వాత ఆంగ్లంలో చదివి అవగాహన పెంచుకుంటారనే లక్ష్యంతో ఇలా ముద్రించినట్లు అధికారులు తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులు ఆంగ్లంలో పాఠ్యాంశాలను బాగా అర్థం చేసుకోలేకపోతున్నారంటూ గతంలో విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేసిన జనార్దన్‌రెడ్డి క్షేత్రస్థాయి పర్యటనలో గుర్తించారు. రెండు భాషల్లో పాఠాలను ముద్రించాలని ‘రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి’ని అప్పట్లో ఆయన ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థులు 97 వేల మంది ఉన్నారు. తెలుగు మీడియం విద్యార్థులకు కూడా ఇవే పుస్తకాలను పంపిణీ చేశారు.